దేశంలో పౌరహక్కుల హరణం
‘ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు పౌరుడి ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయడం, సాధారణ నిరసనలను క్రిమినలైజ్ చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధం.’ ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యక్తపరిచిన ఈ తీవ్ర ఆందోళన దేశవ్యాప్త పౌర సమాజంలోనూ, న్యాయ కోవిదుల్లోనూ ఒక లోతైన ఆత్మపరిశీలనాత్మక మథనాన్ని రేకెత్తించింది.
న్యాయమూర్తులు సాధారణంగా తమ అధికారిక తీర్పుల ద్వారా మాత్రమే మాట్లాడటం రివాజు. కానీ, ఎప్పుడైతే పౌరహక్కుల పునాదులు కదులుతున్నాయని, వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన ఆత్మరక్షణ కవచాలు విచ్ఛిన్నమవుతున్నాయని భావిస్తారో, అప్పుడే ఇటువంటి ఆవేదనాపూరిత తీవ్ర హెచ్చరికలు బహిరంగంగా వెలువడతాయి. ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయి వర్తమానానికి పరిమితమైనవి కావు; తెలంగాణ సామాజిక, రాజకీయ క్షేత్రంలో ఇటీవలి పరిణామాలతో పాటు దేశవ్యాప్తంగా సాగుతున్న పౌరహక్కుల సంక్షోభానికి స్పష్టంగా అద్దం పడుతున్నాయి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలకు తక్షణ క్షేత్రస్థాయి, చారిత్రక ప్రాధాన్యాన్ని కల్పించింది మాత్రం ఇటీవల ‘కాక్రోచ్ జనతా పార్టీ’ రూపంలో తరలివచ్చిన అపూర్వ యువజన పోరాటమే. న్యాయస్థానంలో యువతను, నిరుద్యోగులను ఉద్దేశించి ఉచ్ఛరించిన అనుచిత పదజాలానికి నిరసనగా ఆవిర్భవించినప్పటికీ, తదుపరి ఈ సత్యాగ్రహం డిజిటల్ యుగంలో వారికి అందుబాటులో ఉన్న వివిధ మధ్యమాల ద్వారా ఆందోళనల సరళిని పూర్తిగా మార్చివేసింది.
ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఉద్యోగ ప్రకటనల్లో ఆలస్యం, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై కోట్లాదిమంది యువత వీధుల్లోకి వచ్చిన తీరు పాలకుల నిరంకుశత్వానికి తీవ్ర హెచ్చరికగా నిలిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అశాంతి గా ఉన్న యువతను ‘శాంతిభద్రతల సమస్య’గా పరిగణించి, వారిపై పోలీసు బలగాలను ఉపయోగించడం, అర్ధరాత్రి వేళల్లో హాస్టళ్లపై దాడులు చేసి లాఠీఛార్జీ చేయడం, వారిపై తీవ్రమైన కేసులు బనాయించడం ద్వారా ప్రజాస్వామిక వేదికలను ఎంతగా కుంచించుకుపోయేలా చేస్తున్నారో ఈ ఉద్య మం అనంతరం మరింత విస్పష్టమైంది.
ఇదే ధోరణి తెలంగాణలో కూడా కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సుదీర్ఘ ప్రజా పోరాటాల ఫలితంగానే సాకారమైంది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు, హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద గల ‘ధర్నా చౌక్’ వంటి వేదికలు పౌరహక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామిక గొంతుకలకు ఊపిరిగా నిలిచాయి. అయితే, కాలక్రమేణా పాలకుల ముఖచిత్రాలు మారినా, భిన్నాభిప్రాయాలను అణచివేసే ‘ఆంక్షల సంస్కృతి’ మాత్రం మారకపోవడం విచారకరం. గతంలో ట్రాఫిక్ నెపంతో ధర్నా చౌక్‌ను ఎత్తివేసి నగర శివార్లకు తరలించడం పౌర స్వేచ్ఛపై వేసిన మొద టి దెబ్బగా నిలిచింది. చివరకు ప్రజా సంఘా లు సుదీర్ఘ న్యాయపోరాటం చేసి హైకోర్టు ద్వారా ఆ హక్కును పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది.
నేటికీ అసెంబ్లీ లేదా సచివాలయాల ముట్టడి పిలుపులు వెలువడిన ప్రతిసారీ విపక్ష నాయకులను, పౌర హక్కుల నేతలను తెల్లవారకముందే ఇళ్లల్లో నిర్బంధించడం లేదా ముందస్తుగా కస్టడీలోకి తీసుకోవడం నిత్యకృత్యమైంది. ఉమ్మడి వికారాబాద్ జిల్లా లగచర్ల లేదా ఫార్మా విలేజ్ భూసేకరణ బాధితులు తమ భూములను కాపాడుకోవడానికి రోడ్డెక్కితే, వారిపై తీవ్రమైన నేర విభాగాలు కింద కేసులు నమోదు చేయడాన్ని మనం చూశాం. పౌరుల సహజ నిరసనలను శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించి, సామాన్యులను క్రిమినల్స్‌గా మార్చే ఈ విధానం జస్టిస్ భుయాన్ ఎత్తిచూపిన ‘సాధారణ ఆందోళనల క్రిమినలైజేషన్’ అనే అపశ్రుతికి సజీవ నిదర్శనం.
మరోవైపు, డిజిటల్ యుగంలో భావప్రకటనా స్వేచ్ఛకు ప్రధాన వేదికగా మారిన సోషల్ మీడియాపై ప్రభుత్వాల ఉక్కుపాదం మరీ ఘోరంగా తయారైంది. ప్రభుత్వ విధానాలను, పాలనా లోపాలను విమర్శించే యూట్యూబర్లు, డిజిటల్ మీడియా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై నోటీసులు లేకుండానే కేసులు నమోదు చేయడం, తెల్లవారకముందే ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకోవడం పరిపాటిగా మారింది.
ఒకవేళ కోర్టులు వారికి బెయిల్ ఇచ్చినా, ‘సోషల్ మీడియాలో విమర్శలు చేయకూడదు’, ‘ప్రజా సమావేశాల్లో పాల్గొనకూడదు’ వంటి షరతులు విధించడం ద్వారా పౌరుల నోళ్లకు పరోక్షంగా తాళాలు వేస్తున్నారు. బెయిల్ ఇవ్వడమే పెద్ద మినహాయింపుగా మారి, పౌరుడి రాజ్యాంగబద్ధమైన వృత్తి స్వేచ్ఛను, జీవించే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. అదేవిధంగా హైడ్రా లాంటి సంస్థలు చట్ట పరిధి లో పనిచేయకుండా విచక్షణారహితంగా వ్యవహరించడంతో అనేక మంది అభాగ్యు లు జీవించే హక్కును కోల్పోయారు.
మన దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తీవ్రంగా గాయపరుస్తున్న మరొక ప్రమాదకర ధోరణి రాజకీయ ప్రత్యర్థులపై, నిరసనకారులపై అక్రమంగా తీవ్ర చట్టాల కింద కేసులు బనాయించి, నేరం నిరూపితం కాకుండానే వారిని ఏళ్ల తరబడి విచారణాధీన ఖైదీలుగా జైళ్లలో మగ్గేలా చేయడం. ‘నేరం రుజువయ్యేంత వరకు వ్యక్తి నిరపరాధి’ అనే విశ్వజనీన క్రిమినల్ న్యాయసూత్రాన్ని పక్కనబెట్టి, చట్టాలను రాజకీయ ప్రతీకార సాధనాలుగా మారుస్తున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఉపా వంటి కఠిన చట్టాల్లోని నిబంధనలను ఆసరాగా చేసుకుని బెయిల్ మంజూరును అత్యంత సంక్లిష్టంగా మార్చారు.
ఇటువంటి చట్టాల కింద అరెస్టయిన రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు సంవత్సరాల తరబడి జైళ్లలోనే గడపాల్సి వస్తోంది. సుదీర్ఘ విచారణ ముగిసి, తీర్పు వచ్చేనాటికి వారి జీవితాల్లో విలువైన సమయం, ఆరోగ్యం, సామాజిక గౌరవం మట్టిపాలవుతున్నాయి. ఒకవేళ చివరికి కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసినా, ఆ విధించిన అక్రమ జైలు శిక్షకు, కోల్పోయిన కాలాన్ని ఎవరు పూడ్చగలరనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
ఢిల్లీ అల్లర్ల కేసులు, భీమా కోరెగావ్ వ్యవహారాల నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో విపక్ష నాయకులపై, ప్రజాసంఘాల నాయకులపై ముందస్తు నోటీసులు లేకుండా బనాయించిన అక్రమ కేసుల వరకు ప్రతిఘటన గొంతులను నొక్కే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి రోజుల్లో ప్రతిపక్ష నాయకుల ముందస్తు అరెస్టులు, ఉదయాన్నే నిర్వహించే దాడులు రాజ్యాంగబద్ధమైన సమానత్వ హక్కును, జీవించే హక్కును తుంగలో తొక్కుతున్నాయి.
గడిచిన పుష్కర కాలంగా దేశంలో కార్యనిర్వాహక వర్గం అత్యంత శక్తివంతంగా మారిన ప్రతిసారీ, పౌర హక్కుల రక్షణలో న్యాయవ్యవస్థ పాత్రపై తీవ్రమైన పునరాలోచనలు జరుగుతున్నాయి. రాజ్యాంగబద్ధతను సవాలు చేసే ముఖ్యమైన పిటిషన్లను విచారించడం లో న్యాయస్థానాలు తీవ్ర ఆలస్యం చేయడం వల్ల ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలు తిరుగులేని విధంగా అమలులోకి వచ్చేస్తున్నాయి.
అంతేకాకుండా, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామిక విమర్శకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు పరాకాష్ఠకు చేరిన సమయంలో న్యాయస్థానాలు తక్షణ రక్షణ గోడగా నిలబడలేకపోయాయనే అభిప్రాయం పౌర సమాజంలో బలపడింది. దీనికి తోడు న్యాయమూర్తులు పదవీ విరమణ చేశాక రాజ్యసభ సభ్యత్వాలు, గవర్నర్ పదవులు పొందడం వంటివి న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
ఈ పరిణామాల నేపథ్యంలోనే, ‘బెయిల్ అనేది నియమం... జైలు అనేది మినహాయింపు’ అనే రాజ్యాంగ సూత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గట్టిగా పునరుద్ఘాటించాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలు ప్రజాస్వామ్యంలో సజీవంగా ఉన్న యువత ఆక్రోశానికి ప్రతీకలు. పాలకులు మారినంత మాత్రాన రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కుల సరిహద్దులు మారకూడదు.
తెలంగాణలోనైనా, దేశంలోనైనా సజీవ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలవాలంటే కార్యనిర్వాహక వర్గం తన అధికార పరిధులను తెలుసుకుని ప్రవర్తించాలి. అంతకంటే ముఖ్యంగా, కార్యనిర్వాహక వర్గం చేసే అతిక్రమణలను అడ్డుకునే నిరపేక్షమైన, కంటికి రెప్పలా కాపాడే స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ రక్షకుడిగా నిలబడాలి. జస్టిస్ భుయాన్ చేసిన తీవ్రమైన హెచ్చరికలను సమస్త వ్యవస్థలు గుర్తించి, ప్రతిపక్షాలపై అక్రమ కేసుల సంస్కృతికి ముగింపు పలికి, పౌర స్వేచ్ఛకు పునరంకితమైనప్పుడే భారత ప్రజాస్వామ్యానికి అసలైన బలం, భవిష్యత్తు లభిస్తాయి.
వ్యాసకర్త: తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) అధ్యక్షుడు
డా.ఎర్రోజు శ్రీనివాస్






