మళ్లీ మొదలైన లారీల బ్యాటరీ చోరీలు.. ఆందోళనలో యజమానులు..?
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 25 ( విజయక్రాంతి ): బ్యాటరీల చోరీలతో లారీ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ది కాకతీయ లారీ అసోసియేషన్ వద్ద పెట్టిన, ప్రధాన రహదారి చుట్టు పక్కల పెట్టిన లారీల బ్యాటరీలు గతంలో చాలా వరకు చోరీకి గురయ్యాయి. అసోసియేషన్ వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దృష్టిసారించడంతో చోరీలు అప్పట్లో చోరీలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. దాంతో లారీ యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రాత్రి ఏకంగా మూడు లారీల బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. దీంతో మళ్లీ లారీ యజమానుల్లో కలవరం మొదలయింది. బ్యాటరీ ధర దాదాపు 15 నుండి 16 వేల వరకు ఉంటుందని అసలే అలాట్ మెంట్ లేక నెల నెల కిస్తీలు కట్టలేకపోతున్న తమకు బ్యాటరీల ఖర్చు మరింత భారంగా మారుతుందని లారీ యజమానులు వాపోతున్నారు. పోలీసులు చొరవచూపి రాత్రి పూట పెట్రోలింగ్ పెంచాలని ఈ సందర్భంగా లారీ యజమానులు కోరుతున్నారు.






