ఎలక్ట్రికల్ ఏఈపై విచారణ జరపాలని గుట్ట ఈఓకు వినతి
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 14 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉద్యోగుల వ్యవహార శైలి, టెండర్ల అవకతవకలపై ప్రచార మాధ్యమాలలో వస్తున్న వార్తలపై వెంటనే స్పందించాలని యాదగిరిగుట్ట భారత కమ్యూనిస్టు పార్టీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దేవస్థానం కార్యనిర్వాహణ భవాని శంకర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ శాఖ కార్యదర్శి, 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ప్రచార మాధ్యమాలలో దేవాలయ ఉద్యోగులకు, ఇతర వ్యవహా రాలకు, టెండర్లకు సంబంధించి అనేక వార్తా కథనాలు వస్తున్నాయన్నారు. ఈ రకంగా తరచూ దేవాలయం పైన వార్త కథనాలు రావడం వలన భక్తుల అనేక అపోహలు ఆందోళన ఏర్పడి ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు.
ఎలక్ట్రికల్ ఏఈ అంజయ్య వయసు 73 సంవత్సరాలు అయినా ఇంకా ఉద్యోగిగా కొనసాగుతున్నాడని, ఎలక్ట్రికల్ ఏఈ అనేది చాలా ముఖ్య మైన టెక్నికల్ పోస్టు కావున తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అలాగే గో దాంలో పకోడీలు తయారు, టెండర్లల్లో అవుకతవకలు జరిగి దేవాలయం ఆదాయానికి నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ రకంగా నిత్యం ఏదో ఒక వార్తలు వస్తున్నందున దేవాలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు.
ఒకవైపు భక్తులు కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఇలా వార్తలు రావడం వలన భక్తుల మనోభావాలు దెబ్బతినడం కాకుండా ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఇలాంటివి జరగకుండా వీటన్నిటి పైన సమగ్ర విచారణ జరిపించాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, పట్టణ కార్యవర్గ సభ్యులు కోకల రవీందర్, అరె పుష్ప, పాకాలపాటి రాజు తదితరులు ఉన్నారు.






