30 July, 2026 | 2:48 AM

రుణాలను రీ షెడ్యూల్ చేయాలె

25-08-2024 01:55 AM

రాష్ట్రానికి సహాయం చేయాలి

వడ్డీ రేట్లను తగ్గించాలె

నిర్మలా సీతారామన్‌ను కోరిన భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయ క్రాంతి) : రుణాలను రీ షెడ్యూల్ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను  నిర్మలా సీతారామన్‌కు వివరించి సహాయం అందించాలని కోరానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలతోపాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశానన్నారు. గత ప్రభుత్వం బడ్జెటేతర రుణాలు చేసిందని, అవి రాష్ట్ర ఖజానాపై తీవ్ర రుణ భారాన్ని మోపుతున్నాయని పేర్కొన్నారు.

వీటిని రీ షెడ్యూల్ చేసి కొంత ఉపశమనం కలిగించాలని కోరినట్టు తెలిపారు. రూ.31,795 కోట్ల మేర అధిక వడ్డీకి గత ప్రభుత్వం రుణాలు చేసిందన్నారు. వడ్డీ రేట్లు తగ్గించాలని కోరినట్టు స్పష్టం చేశారు. జీతాల కంటే ఎక్కువ మొత్తం అప్పులపై వడ్డీనే కట్టాల్సి వస్తోందన్నారు. ఇలాంటి మొత్తం 8 అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాకు రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశానని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు గత కొన్ని ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన బకాయి నిధులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కేంద్ర ప్రభుత్వాధికారులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు చెప్పారు.