టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం
తెలంగాణలో పర్యాటకానికి కేంద్రం సహకరించాలె
కేంద్ర మంత్రి షెకావత్‌కు మంత్రి కృష్ణారావు వినతి
ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయండి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన జూపల్లి
హైదరాబాద్, ఆగస్టు 24(విజయక్రాంతి): కేంద్రం సహకరిస్తే తెలంగాణ పర్యాటక రంగాన్ని కొంత పుంతలు తొక్కిస్తామని రాష్ర్ట టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఆయన కోరారు. శనివారం ఢిల్లీలోని గజేంద్ర షెకావత్ క్యాంపు కార్యాలయంలో ఆయన్ను మంత్రి జూపల్లి కలిశారు. తెలంగాణలో టూరిజం అభివృద్థికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
తమ రాష్ట్రంలో టూరిజానికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని షెకావత్‌కు జూపల్లి చెప్పారు. అనంతరం మీడియాతో మంత్రి జూపల్లి మాట్లాడుతూ తన వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. తెలంగాణ టూరిజం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషి స్తున్నామని, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు.
ఎకో, వాటర్ బాడీస్, టెంపుల్, హెల్త్ అండ్ వెల్నెస్ టూరిజానికి తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వార్షిక బడ్జెట్ లో రాష్ర్ట ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమని, నిధును కేటాయించాలని షెకావత్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతన పర్యాటక విధానం తీసుకువచ్చి తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి వెంట తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్యకాదర్శి వాణీప్రసాద్, పర్యాటక అభివృద్ది సంస్థ ఎండీ ప్రకాశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను జూపల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆక్రమణలపై చర్యలు తప్పవు..
అక్రమ కట్టడాల కూల్చివేతపై ఢిల్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని, దాని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, భవిష్యత్ తరాల సంపదను కాపాడవలసిన అవసరం ఉందన్నారు. అందుకే వాటి పరిరక్షణను చర్యలు తీసుకుంటామని వెల్లడిం చారు. ప్రభుత్వ వ్యవస్థలు తామ పని తాము చేసుకుపోతున్నాయని, ప్రభుత్వం అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని అన్నారు.
ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయండి
కృష్ణా నదిపై సోమశీల(తెలంగాణ), సంగమేశ్వర(ఏపీ) మధ్య డబుల్ డెక్కర్ కేబుల్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రక్రియను వేగవంతం అయ్యేలా చూడాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. శనివారం ఢిల్లీలో గడ్కరీని మంత్రి జూపల్లి కలిశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్‌లోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్‌ల గురించి ఆయనతో చర్చించారు. కృష్ణా నదిపై రూ.1082.56కోట్లతో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనులు రెండేళ్లుగా ముందుకు సాగడం లేదని, వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.
ఈ వంతెన నిర్మాణంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. తిరుపతికి కనీసం 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని గడ్కరీకి జూపల్లి వివరించారు. అనంతరం జూపల్లి మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవి, ఎత్తున పర్వతాల మధ్య నిర్మించే ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఇదొక పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సెప్టెంబర్‌లోగా టెండర్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు జూపల్లి వివరించారు. అలాగే వంతెనకు అనుసంధానంగా అలంపూర్, జట్రోల్, పెంట్లపల్లి, కొల్లాపూర్, లింగాల్, అచ్చంపేట, హాజీపూర్, డిండి, దేవరకొండ మార్గం ద్వారా వెళ్లే రోడ్డును జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరినట్లు చెప్పారు.






