30 August, 2026 | 3:42 AM

కడసారి వీడ్కోలుకూ నోచుకోలేదు!

30-08-2026 01:38 AM
  1. నేపాల్‌లో ఒకేరోజు ౨౩౩ మృతదేహాల వెలికితీత
  2. నలుగురి వివరాలు మాత్రమే గుర్తింపు
  3. మిగిలిన ౨౨౯ మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు
  4. మొత్తంగా 6౭౫కి చేరిన మృతుల సంఖ్య
  5. మరో ౨,౪౦౦ మంది ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ

ఖాఠ్మాండు, ఆగస్టు ౨౯: నేపాల్‌లో మరణ మృదంగం మోగుతూనే ఉన్నది. వరద బీభత్సం తాలూకు విషాదఛాయలు నదీ పరీవాహక ప్రాంతాలను అలముకూనే ఉన్నాయి. ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్‌లో వందలాది మృతదేహాలు బయటపడుతున్నాయి. చిత్వాన్ జిల్లాలో రెస్క్యూ సిబ్బంది వెలికితీసిన 233 మృతదేహాల్లో కేవలం నాలుగింటిని మాత్రమే కుటుంబ సభ్యులు గుర్తించగలిగారు.

మిగిలిన ౨౨౯ మృతదేహాలకు శనివారం స్థానిక యంత్రాంగం దేవఘాట్‌లో సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. భవిష్యత్తులో మృతదేహాల గుర్తింపు కోసం ప్రతి మతదేహం నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. వాటికి ప్రత్యేక కోడ్ ఇచ్చి రికార్డులను భద్రపరుస్తున్నారు. తాజా అధికారిక గణాంకాల ప్రకారం వరదల్లో గల్లంతై మృతిచెందిన వారి సంఖ్య 6౭౫కి చేరుకుంది.

మరో ౨,౪౦౦ మంది ఆచూకీ కోసం రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. గల్లంతైన వారిలో నేపాలీలతో పాటు విదేశీ పర్యటకులూ ఉన్నారు. నేపాల్‌తో పాటు టిబెట్ ప్రాంతంలో కూడా భారీగా ప్రాణనష్టం సంభవించింది. వేలాది నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. మరికొన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. 

మళ్లీ భయం.. భయం

భోటేక్యోషి, త్రిశూలి నదుల్లో నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. దీంతో సరస్సుల ఆనకట్టలు తెగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం నేపాల్ ప్రభుత్వం తొలుత విదేశీ సహాయాన్ని తిరస్కరించింది. కానీ, పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాల సాయం కోరింది. ఆయా దేశాల నుంచి ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రవాణా సౌకర్యం లేని ప్రదేశాల్లోనూ సైనిక బలగాలు ప్రాణాలను పణంగా పెట్టి సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.

‘ఇన్ఫోసిస్’ లక్ష్మీనాథ్ మిస్సింగ్

నేపాల్ వరదల్లో ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈవో లక్ష్మీనాథ్ గోపిశెట్టి గల్లంతయ్యారు. వ్యక్తిగత పనిమీద నేపాల్ వెళ్లిన ఆయన వరదల అనంతరం అందుబాటులోకి రాలేదు. ఫోన్ కూడా అవుట్ ఆఫ్ సర్వీస్‌గా వస్తున్నట్లు సంస్థ అధికారులు శనివారం ప్రకటించారు. ఆయన క్షేమంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవడమే తమ తక్షణ ప్రాధాన్యత అని ఆ సంస్థ వెల్లడించింది. 

౮౮ మంది భారతీయులు సురక్షితం

నేపాల్ వరదలపై శనివారం రాత్రి భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. వరదల్లో మొత్తంగా 287 మంది భారతీయులు గల్లంతు కాగా, వారిలో 88 మంది సురక్షితంగా వరద ముప్పు నుంచి బయటపడినట్టు స్పష్టం చేసింది. గల్లంతైన వారిలో 128 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నట్లు పేర్కొంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం భారత్ నుంచి ప్రత్యేక సహాయక బృందాలు నేపాల్‌కు చేరుకున్నాయని, ఆయా బృందాలు ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నట్లు తెలిపింది.