30 August, 2026 | 3:59 AM

తాష్కెంట్‌లో మోదీకి ఘన స్వాగతం

30-08-2026 01:35 AM

తాష్కెంట్, ఆగస్టు ౨౯: ప్రధాని మోదీ తన నాలుగు రోజుల మధ్య ఆసియా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్నారు. తాష్కెంట్ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయే ఆయనకు ఘనస్వాగతం పలికారు. మోదీ అనంతరం తాష్కెంట్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అనంతరం ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగం, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, సాంస్కతిక సంబంధాల బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు.

భారత్ ‘వికసిత్ భారత్ 2047’, ఉజ్బెకిస్థాన్ ‘యాంగి ఉజ్బెకిస్థాన్’ లక్ష్యాలకు అనుగుణంగా సిద్ధం చేసిన ప్రణాళికలను పరస్పరం పంచుకున్నారు. కాగా, మోదీ ఆదివారం కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కేక్‌కు చేరుకోనున్నారు. అక్కడ ద్వైపాక్షిక చర్చల అనంతరం సోమవారం చైనాలోని షాంఘైకు పయనం కానున్నారు. అదేరోజు షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. మోదీ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు ప్రపంచ నేతలతో భేటీ కానున్నారు.