5 July, 2026 | 6:40 PM

జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ పోస్టుకు రిజర్వేషన్ కేటాయించాలి

05-07-2026 05:54 PM

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని మచ్చుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శుక్రవారంపేట అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయించాలని మచ్చుపేట మాజీ వార్డు సభ్యురాలు బూర్ల రజిత డిమాండ్ చేశారు. శుక్రవారంపేట అంగన్వాడీ కార్యకర్త అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో ఆ పోస్టు భర్తీకి అధికారులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటాయించినట్లు ఆమె తెలిపారు. అయితే శుక్రవారంపేట అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఓసీ వర్గానికి చెందిన ఒక్క కుటుంబం కూడా లేదని పేర్కొన్నారు.

గతంలో కూడా ఇదే కేంద్రానికి ఓసీ రిజర్వేషన్ కేటాయించడంతో మచ్చుపేట గ్రామానికి చెందిన అభ్యర్థి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కారణంగా మచ్చుపేట గ్రామానికి చెందిన వారికే అవకాశం కలుగుతుందని, శుక్రవారంపేట గ్రామానికి న్యాయం జరగదని అన్నారు. అందువల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను రద్దు చేసి, స్థానిక జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్ కేటాయించి శుక్రవారంపేట గ్రామానికి చెందిన అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.