17-01-2026 06:48:13 PM
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి.పాటిల్ లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనల మేరకు పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ కొనసాగింది.
ఇల్లందు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా, వాటిలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కు 2, షెడ్యూల్డ్ కాస్ట్స్ (ఎస్సీ)కు 4, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీ)కు 6, సాధారణ మహిళలకు 6, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 6 వార్డులు కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో వార్డు నెంబర్లు 11, 3గా ఖరారవగా, ఇందులో ఎస్టీ మహిళలకు వార్డు నెంబర్ 11, ఎస్టీ జనరల్‌కు వార్డు నెంబర్ 3 కేటాయించారు. ఎస్సీ కేటగిరీలో వార్డు నెంబర్లు 24, 12, 21, 14గా నిర్ణయించగా, ఎస్సీ మహిళలకు 12, 24, ఎస్సీ జనరల్‌కు 21, 14 వార్డులు కేటాయించారు. బీసీ కేటగిరీలో వార్డు నెంబర్లు 13, 10, 15, 2, 17, 9గా ఖరారవగా, ఇందులో బీసీ మహిళలకు 9, 2, 15, బీసీ జనరల్‌కు 13, 10, 17 వార్డులు కేటాయించారు.
సాధారణ మహిళల కేటగిరీలో వార్డు నెంబర్లు 16, 4, 6, 19, 5, 18గా నిర్ణయించగా, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో వార్డు నెంబర్లు 8, 7, 23, 1, 20, 22గా ఖరారయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకొని, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలిపారు. లాటరీ పద్ధతిలో ఖరారైన రిజర్వేషన్ల పూర్తి వివరాలను ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సంబంధిత మున్సిపల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.