పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి
భారీ వర్షాలతో ఉప్పొంగిన జలాశయం.. తిలకించేందుకు తరలివెళ్తున్న ప్రజలు
రామగిరి,(విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కమాన్‌పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలోని గౌరిగుండం జలపాతం నుంచి భారీగా వరద నీరు చేరడంతో రిజర్వాయర్ పూర్తిస్థాయికి చేరి మత్తడి పరవళ్లు తొక్కుతోంది. రిజర్వాయర్ మత్తడి పైనుంచి ప్రవహిస్తున్న నీరు బండల వాగు ద్వారా దిగువకు వెళ్లడంతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
మత్తడిపై నుంచి ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న జలధారలను చూసేందుకు గుండారం గ్రామంతో పాటు కమాన్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాలతో నిండుకుండలా మారిన గుండారం రిజర్వాయర్ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. అయితే మత్తడి వద్ద నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.






