విద్యుత్ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం..
బోర్లపై ఆధారపడనున్న వ్యవసాయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున మునుగోడు నియోజకవర్గంలో వ్యవసాయం బోరుబావులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో నీటి సమస్యతో పాటు విద్యుత్ సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
కరెంట్ నేడు జీవనంలో భాగమైందని, విద్యుత్ సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.మునుగోడు నియోజకవర్గాన్ని విద్యుత్ రంగంలో రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు దశలవారీగా చర్యలు చేపట్టాలని అన్నారు. ముందుగా మండల కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించి, అనంతరం గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆ తర్వాత వ్యవసాయ బోరుబావులకు సంబంధించిన విద్యుత్ లైన్లను దశలవారీగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
ఇళ్లపై విద్యుత్ తీగలు లేకుండా చర్యలు
మండల కేంద్రాల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను తొలగించి, లైన్లను సురక్షిత ప్రాంతాలకు మార్చేందుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు పనిచేయాల్సిన బాధ్యత తమదేనని, అవసరమైన నిధులను తీసుకురావాల్సిన బాధ్యత తనదని ఎమ్మెల్యే తెలిపారు. పనిచేసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించే బాధ్యత నాది.. బాధ్యతగా పనిచేయాల్సిన బాధ్యత మీది. పని చేయలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి" అని అధికారులకు స్పష్టం చేశారు.
ఏఈ నరేందర్‌కు ఎమ్మెల్యే పరామర్శ
పని ఒత్తిడి, అధికారుల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునుగోడు ఏఈ నరేందర్‌ను ఎమ్మెల్యే ఫోన్‌లో పరామర్శించారు. శాఖలో ఏం జరుగుతుందో పర్యవేక్షించాల్సిన బాధ్యత పైస్థాయి అధికారులపై ఉందని పేర్కొన్నారు. నరేందర్‌కు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకుని విధుల్లో చేరాలని, తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
లో-వోల్టేజీ సమస్యపై సీఎండీకి ఫోన్
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోరుబావులపై విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, దీంతో నియోజకవర్గంలో లో-వోల్టేజీ సమస్య తలెత్తే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారంతో పాటు వివిధ దశల్లో ఉన్న సబ్‌స్టేషన్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తామని సీఎండీ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
వివిధ దశల్లో 12 సబ్‌స్టేషన్లు
నియోజకవర్గంలో ప్రస్తుతం 31 సబ్‌స్టేషన్లు పనిచేస్తున్నాయని సమీక్షలో అధికారులు వివరించారు. ఇటీవల నిర్మించిన 6 సబ్‌స్టేషన్లు వినియోగంలోకి వచ్చాయి. మరో 3 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 6 సబ్‌స్టేషన్లు మంజూరై టెండర్ దశలో ఉండగా, మరో 3 సబ్‌స్టేషన్లకు భూమి కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ దశల్లో ఉన్న సబ్‌స్టేషన్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు భద్రతతో కూడిన నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా విద్యుత్ మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.సమీక్షలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్‌ఈ సురేష్, నల్లగొండ కన్స్ట్రక్షన్ డీఈ నరసింహ, దేవరకొండ డీఈ బాల్యనాయక్, నల్లగొండ డీఈ విద్యాసాగర్, చౌటుప్పల్ డీఈ మల్లికార్జున్, నాంపల్లి, మునుగోడు, చౌటుప్పల్ ఏడీఈలు, వివిధ మండలాల ఏఈలు ఉన్నారు.






