శాస్త్రీయ విధానంలోనే బారాజ్‌ల పునరుద్ధరణ
- నాగార్జున సాగర్‌కే మొదటి ప్రాధాన్యం
- నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారస్ మేరకు చర్యలు
- ప్రజల భద్రతకు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నల్లగొండ, జూలై 4 (విజయక్రాంతి) : నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారాజ్‌ల నిర్వహణలో లోపాలు తలెత్తవని స్పష్టత వచ్చేలా శాస్త్రీయ విధానంలో బ్యారేజీల పునరుద్ధరణ పూర్తి చేసి ప్రభుత్వం వాటిని నిర్వహించనుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
శనివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ విజయవిహార్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో నాగార్జునసాగర్‌తో పాటు ఇతర ప్రధాన ప్రాజెక్టులపై ఎమ్మెల్యే కుందూరు జై వీర్‌రెడ్డితో కలిసి సుదీర్ఘ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం పరిధిలోని బారాజ్‌ల పునరుద్ధరణకు ముందు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ సంయుక్తంగా పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరమ్మత్తులు చేపట్టకుండా బ్యారేజ్ లను నిర్వహిస్తే భద్రాచలం పుణ్యక్షేత్రంతో పాటు మరో 40 గ్రామాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రజల భద్రతకు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బ్యారేజీల పునరుద్ధరణ పనుల్లో భాగంగా జియో టెక్నికల్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, గ్రౌండ్ పెనే ట్రేటింగ్ రాడార్ సర్వేలు, డ్రోన్ ఆధారిత, సుమారు వందకు పైగా బోర్ హోల్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి చెప్పారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులకు అనుగుణంగా బారాజ్‌ల గేట్లు అన్ని తెరిచి వాటిపై నీటి ప్రెషర్ లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. భవిష్యత్తులో బ్యారేజ్‌ల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా అంతర్జాతీయ నిపుణులు, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ కలిసి పునరుద్ధరణ పనులపై డిజైన్లను పరిశీలిస్తున్నాయన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణ, ప్రాజెక్టు పరిధిలోని కాలువలకు లైనింగ్ నిర్మాణం, ఇతర అవసరమైన పనులు చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
3.58 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టాక ఈ రెండున్నర ఏళ్ల పాలనలో మూడు కోట్ల 58 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి రూ. 79,886 కోట్లను రైతులకు చెల్లించిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వేములపల్లి మండల పరిధి శెట్టిపాలెం వద్ద రూ. 150 కోట్లతో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించిన బండారు ఆగ్రో టెక్ రైస్ మిల్లును ప్రభుత్వ చీఫ్ విప్ వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఆలిండియా రైస్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ గుమ్మడి వెంకటేశ్వరరావు, వైటీడీఏ డైరెక్టర్ గుండా మల్లయ్య, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నపరెడ్డి, ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ తదితరులున్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండ లం చిట్యాల వద్ద నిర్మాణంలో ఉన్న దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మె ల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు.






