జీర్ణోద్ధరణ పనులు వేగవంతం
- కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం షురూ
- మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో రూ.198 కోట్లతో పనులు
- కృష్ణశిలతో ఆలయ నిర్మాణం
- భక్తులకు ఆధునిక సౌకర్యాలు
- పుష్కరాల నాటికి అందుబాటులోకి కొత్త కాళేశ్వరం
కాళేశ్వరం/మంథని, ఆగస్టు 8 (విజయక్రాంతి): తెలంగాణ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పాత గర్భగుడిని సైతం కూల్చివేశారు. భారీ యంత్రాలతో గర్భగుడి నేలమట్టం కావడం చూసిన అర్చకులు, భక్తులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా పూజలు, దర్శనాలకు సాక్ష్యంగా నిలిచిన గర్భగుడి కళ్లముందే కనుమరుగవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు చరిత్రతో ముడిపడిన నిర్మాణాన్ని కోల్పోతున్నామనే బాధ.. మరోవైపు మరింత వైభవంగా కొత్త ఆలయం రూపుదిద్దుకోనుందనే ఆశాభావం భక్తుల్లో వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రియల్, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాళేశ్వరం క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో పునర్నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
198 కోట్లతో మహా పునర్నిర్మాణం
కాళేశ్వరం ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.198 కోట్లతో భారీ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన ఆలయం, రాజగోపురాలు, ప్రాకారాలు, ఉపాలయాలను సంప్రదాయ శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించనున్నారు. కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం చేపట్టడంతో పాటు భక్తులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలను కూడా కల్పించనున్నారు.
పుష్కరాల నాటికి కొత్త కాళేశ్వరం
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
చరిత్రను మోసిన గర్భగుడి నేలమట్టమైనా.. మంత్రి శ్రీధర్ బాబు చొరవతో కాళేశ్వరం క్షేత్రానికి కొత్త వైభవం తీసుకురావాలన్న ప్రభుత్వం సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. కొత్త ఆలయం ఆవిర్భావంతో కాళేశ్వరం మరింత ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఎదగనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.






