ఇందిరమ్మ ఇండ్లు.. రేవంత్ గేమ్ చేంజర్!
- బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ‘రైతుబంధు’ లాంటి ప్రభావం చూపే పథకం
- పనిచేస్తున్న ప్రాంతంలోనే ఇల్లు నిర్మించేలా పథకం రూపకల్పన
- పథకం విజయవంతం అయితే.. ప్రజలు కాంగ్రెస్ వైపు తిరిగే అవకాశం
* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనల్లోంచి వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం గేమ్ ఛేంజర్‌గా మారబోతుందా..ff అంటే అలాంటి సంకేతాలే కనపడుతున్నాయి. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్లో మంచి పేరు తెచ్చి.. గేమ్ చేంజర్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అనుకున్న పథకం అనుకున్నట్టుగా అమలైతే, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు సాకారమైతే ఈ పథకం రాష్ట్ర రాజకీయాలను నిర్ణయించేదిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* ప్రజలు పనిచేసుకునే ప్రాంతాలకు దగ్గరలోనే.. ధనిక, పేద, స్లమ్ ఏరియాలనే తేడా లేకుండా..ముందుగా లబ్ధిదారులను ఎంపికచేసి ఇందిరమ్మ ఇండ్లను కట్టడమనేది ఇక్కడ కీలకాంశం.
ఈ పథకం విజయవంతం అవ్వాలన్నా.. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళాలన్నా.. ప్రభుత్వ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పారదర్శకత ఎంతో అవసరం. అలాగే ఇందిరమ్మ ఇండ్ల సంఖ్యను పెంచాలి. ఈ పథకంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. నిరుపేదలైతే ప్రభు త్వం నుంచే వచ్చే సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజాపాలనా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సరికొత్తగా రూపొందించారు.
ఇందులో భాగంగానే, ఒక్కో ఇంది రమ్మ ఇంటి నిర్మాణానికి రూ. 11 లక్షలను ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రూ. 5 లక్షలను ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీగా భరించనుంది. మిగిలిన రూ. 6 లక్షలను లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంకూడా బ్యాంకుల నుంచి రుణంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ. 10 వేలు అడ్వాన్స్‌గా కడితే సరిపోతుంది.
ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే..
వాస్తవానికి రేవంత్‌రెడ్డి గేమ్ చేంజర్‌గా మార్పుచేసిన ఈ పథకంలో అతిప్రధానమైనది స్థలాల ఎంపిక. నిరుపేదలు పనిచే సుకునే ప్రదేశాలకు సమీప ప్రాంతాల్లోనే నివసించేందుకు మొగ్గు చూపుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే ప్రణాళికలు రూపొందించింది. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. ప్రజలు పనిచేసుకుంటున్న, నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరలో ఉండే ప్రభుత్వ స్థలాలు, పురాతన కార్యాలయాల స్థలాలు, శిథిలావస్థకు చేరిన భవనాల స్థలాలను సేకరించాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇలా సేకరించిన స్థలాల్లోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మిం చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పైగా ఈ స్థలంకూడా లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ లాంటి ప్రధా న ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు కళకళలాడనున్నాయి. నిజానికి ఇక్కడ గజం స్థలం ధర రూ. 2 లక్షల వరకు ఉంటోంది.
ఇలాంటి ప్రాంతాల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే.. పేదల కల నెరవేరడం లాంటిదే. అందుకే ప్రజల్లోకి ఇది బాగా వెళ్లే అవకాశం ఉంది. పైగా తాము పనిచేసుకుంటున్న ప్రదేశాలకు సమీపంలోనే ఇండ్లను నిర్మించి ఇస్తే ప్రజలు మరింత సౌకర్యవంతంగా భావిస్తారు.
లబ్ధిదారులకు భారీ ఆదా..
నిజానికి 528 చదరపు అడుగుల ఇల్లునే పరిగణలోకి తీసుకుంటే.. ఒక్కో చదరపు అడుగు సుమారు రూ. 5 వేలు అనుకున్నా.. రూ. 25 లక్షలకుపైగా అవుతుంది. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. కేవలం చదరపు అడుగు రూ. వెయ్యికే వస్తోంది. అంటే సుమారు రూ. 20 నుంచి రూ. 25 లక్షల వరకు మిగిలినట్టే.
ఎందుకంటే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రధాన ప్రదేశాల్లోనూ నిరుపేదలకు ఇండ్లు రావడమనేది ఇక్కడ ప్రస్తావనార్హం. పైగా ఇంటి స్థలం పూర్తిగా ఉచితంగా ఇస్తూనే.. రూ. 5 లక్షలు పూర్తి సబ్సిడీగా ఇస్తున్నారు. మిగిలింది రూ. 6 లక్షలు.. మాత్రమే చెల్లించాలి. అంటే చదరపు అడుగు రూ. వెయ్యి పడినట్టే. అందుకే లబ్ధిదారులకు భారీగా ఆదా అవుతుంది.
గతంలో ప్రజలకు దూరంగా..
గత ప్రభుత్వం బీఆర్‌ఎస్ హయాంలో.. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని చేపట్టారు. అయితే ఇలా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలన్నీ.. పట్టణాలకు, పనిచేస్తున్న ప్రదేశాలకు.. ప్రజలకు దూరంగా నిర్మించారు. ప్రజలు ఒక చోట పనిచేస్తుంటే.. వారికి ఎక్కడో దూరంగా.. పట్టణం, నగరం వెలుపల డబుల్ బెడ్రూంలను నిర్మించారు. అక్కడ కనీస వసతులు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయలేదు.
పైగా ముందుగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి.. తరువాత లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయడమ నేది ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కల్గించింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినా.. లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఆ పథకం విఫలం అయ్యింది. ఇక్కడే కాంగ్రెస్ ప్రభు త్వం గేమ్ చేంజర్‌గా వ్యవహరించింది.
పట్టణాలకు, ప్రజలు పనిచేసే ప్రదేశాలకు, కనీస మౌలిక వసతులు లేని ప్రాంతాలను కాకుండా.. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేలా వ్యవహరించింది. ప్రజలు పనిచేసుకునే ప్రాంతాలకు దగ్గరలోనే.. ధనిక, పేద, స్లమ్ ఏరియాలనే తేడా లేకుండా.. ముందుగా లబ్ధిదారులను ఎంపికచేసి ఇందిరమ్మ ఇం డ్లను కట్టడమనేది ఇక్కడ కీలకాంశం. పైగా 5 కి.మీ దూ రం లోపలే ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రభుత్వం స్పష్టత ఇస్తోంది.
గతంలో ఇదే అంశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పనిచేస్తున్న ప్రదేశానికి 20 నుంచి 30 కి.మీ దూరంలో ఇండ్లను నిర్మించడంతో.. అక్కడికి వెళ్ళలేక.. వెళ్ళినవారు.. తిరిగి పనికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా వ్యవహరించింది.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడక్కడ ఉన్న ప్రభుత్వం ఖాళీ స్థలాలను, పాతబడిన భవంతుల స్థలాలను సేకరించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడమనేది.. అదికూడా 5 కి.మీ లోపలే ఉండేలా చూడటమనేది లబ్ధిదారులపై సానుకూల ప్రభావం చూపేదిగానే చెప్పవచ్చు.
లబ్ధిదారుల ఎంపికతోపాటు.. టెండర్ల ఖరారు, నాణ్యంగా నిర్మాణాలు, సకాలంలో బిల్లుల చెల్లింపును పారదర్శకంగా, నిబద్ధతతో ఇందిరమ్మ ఇండ్లను నిర్దేశించుకున్న ప్రమాణాలతో, లక్ష్యాలతో నిర్మించాలి. విడతల వారీగా నిర్దేశిత సమయంలోగా నిర్మిస్తే.. ప్రజల్లో నమ్మ కం కలుగుతుంది. ప్రభుత్వానికి అనుకూలంగా మళ్ళుతారు. గతంలో రైతు బంధుతో గత ప్రభుత్వానికి ఎలా మేలు జరిగిందో.. అలాగే ఇందిరమ్మ ఇండ్లతో ప్రస్తుత ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. అందుకే రేవంత్‌రెడ్డికి ఇందిరమ్మ ఇండ్లు గేమ్ చేంజర్..!
రైతు బంధులా.. ఇందిరమ్మ ఇండ్లు..
గత ప్రభుత్వం బీఆర్‌ఎస్ హయాంలో.. ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. ఎకరానికి రూ. 5 వేల వరకు (రెండు సీజన్లలో రెండుసార్లు) రైతు బంధు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తూ వచ్చింది. దీనిపై అనేక అధ్యయనాలు జరిగాయి. రైతుకు నేరుగా లబ్ధి అందుతుండటంతో.. సకాలంలో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేశాడని అధ్యయనాల్లో తేలింది.
ఈ రైతు బంధు పథకం ప్రభావంతోనే.. బీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాగలిగింది. ఇదే తరహాలో.. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గేమ్ ఛేంజర్‌గా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రూపొందించింది. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్దేశిత సంఖ్యలో ఇండ్లను నిర్మించాలని నిర్ణయించింది.
పారదర్శకత.. ప్రచారం..
ఈ పథకం విజయవంతం అవ్వాలన్నా.. ప్రజలు కాంగ్రెస్ పార్టీవేపు మళ్ళాలన్నా.. ప్రభుత్వ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పారదర్శకత ఎంతో అవసరం. అలాగే ఇందిరమ్మ ఇండ్ల సంఖ్యను పెంచాలి. ఈ పథకంపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలు...
* ప్రస్తుతం ప్రకటిస్తున్న ఇండ్ల సంఖ్యను మరింతగా పెంచాలి. ప్రతి సంవత్సరం 50 వేలకుపైగా ఇండ్లను మంజూరు చేయాలి. దీనివల్ల తక్కువ కాలం లో ఎక్కువ మందికి ప్రభుత్వ పథకం చేరువ అవుతుంది.
* దీనితోపాటు జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేసేలా తీర్చిదిద్దాలి.
* ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపును రాబోయే 5 సంవత్సరాలకుకూడా ఇప్పుడే పూర్తి చేయలి. దీనివల్ల ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. ఏ సంవత్స రం ఎవరెవరికి ఇండ్లు అందుతాయనేది గుర్తించి, వారికి ఏ సమయంలోగా ఇండ్లను నిర్మించి అప్పగిస్తామనేదికూడా అలాట్‌మెంట్ సర్టిఫికెట్‌లో స్ప ష్టంగా చెప్పాలి.
* లబ్ధిదారుల ఎంపికకూడా పారదర్శకంగా ఉండాలి. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారనే అపవా దు రావద్దు. నిరుపేదలకే అగ్రస్థానం వేయాలి. కమిషన్ ఇస్తేనే ఇల్లు మంజూరు అవుతుందనే దా నికి దూరంగా ఉండాలి. పేదరికమే అసలైన అర్హత గా లబ్ధిదారుల ఎంపిక ఉండాలి.
* ఒక్కో ఇంటి ద్వారా లబ్ధిదారునికి కలిగే లాభాలు (రూ. 20 నుంచి రూ. 25 లక్షల వరకు ప్రత్యక్షంగా లాభం), ఉచిత స్థలం, 5 సంవత్సరాలకు సంబంధించిన లబ్ధిదారులను ఇప్పుడే గుర్తించి, అలాట్ మెంట్ ఇవ్వడం వంటి అంశాల ఆధారంగా ప్రజ ల్లో విస్తృత ప్రచారం చేయాలి.
* గతంలో ప్రకటించిన 6 గ్యారంటీలలో కొన్ని నెరవేర్చలేదు. మరికొన్ని విఫలమయ్యాయనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఈ అసంతృప్తిని పారద్రోలేలా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభావవంతంగా అ మలు చేయాలి. దీనివల్ల ప్రభుత్వానికి మైలేజీ వస్తుంది.
* పథకాల అమలులో గతంలో చేసినట్టుగా తప్పులు చేయకూడదు. అలా చేస్తే మొదటికే మోసం వ స్తుంది. లబ్ధిదారుల ఎంపిక, టెండర్ల నుంచి మొదలుకుని ఇంటి నిర్మాణం, అప్పగింత వరకు మొత్తం పారదర్శకంగా ఉండాలి. ఎస్టిమేట్లు పెంచడం, టెం డరు నిబంధనలను మార్చడం, కొందరికి లాభం కలిగేలా టెండర్లను రూపొందించడం, పేమెంట్ ఇ చ్చేందుకుకూడా కమిషన్లు తీసుకోవడం, నాణ్యతాలోపంగా ఇండ్ల నిర్మాణం లాంటి వాటికి దూరం గా ఉండాలి. పారదర్శకంగా, నాణ్యతతో చేయకపోతే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి






