9 August, 2026 | 1:46 AM

పనులు తక్కువ.. పెంపులే ఎక్కువ!

09-08-2026 12:35 AM
  1. ఏటికేడు పెరిగిపోతున్న పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 
  2. రూ.1,548 కోట్ల అసలు పనులు.. రూ. 3,199 కోట్ల అదనపు పనులు   
  3. మూడేళ్లలో 206 శాతం పెంపు
  4. రివర్స్ టెండరింగ్‌తో గోల్‌మాల్  
  5. కాంట్రాక్టర్లకు భారీగా లబ్ధి
  6. ఆర్టీఐ సమాచారంతో వెలుగులోకి 

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌కు వరంగా భావించే పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టులో నీళ్లకు ముందే.. నిధుల వరద పొంగి పొర్లుతోంది. ప్రభుత్వాలు మారినకొద్దీ.. కాంట్రాక్టర్లను మార్చడం.. ఆపై అదనంగా పనులను చేర్చి అందినంత దండుకుంటున్నారు.

చారాణా పనులకు.. బారాణా పనులను చేర్చి వీలైనంత పిండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు అదనపు లాభం చేకూర్చేలా వీలైనన్ని అదనపు పనులు చేర్చుతున్నారు. పైగా ఇవన్నీ టెండర్లు లేకుండానే కట్టబెట్టుతున్నారు. తాజాగా సమాచార హక్కు కార్యకర్త ఒకరు ఆర్టీఐకి దరఖాస్తు చేయడంతో పోలవరం నిర్మాణ పనుల వెనుక సాగిన అదనపు వ్యవహారం  బయటపడింది. గడిచిన మూడేళ్లలో ప్రాజెక్టు అంచనాలు 206 శాతం పెరగడం గమనార్హం.  

కొత్త ప్రభుత్వం.. రివర్స్ టెండరింగ్

2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యి.. కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి పోలవరం ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణానికి సంబంధించిన సుమారు రూ. 1771.11 కోట్ల విలువైన పనులు పెండింగులో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోలవరం నిర్మాణంలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టరును తప్పించింది. మిగిలిన పనులకు కొత్తగా టెండర్ పిలిచారు. దీనిని రివర్స్ టెండరింగ్ అంటారని అప్పటి ప్రభుత్వంకూడా పేర్కొంది.

ఇందులో పాల్గొన్న టెండర్లను పరిశీలించిన ప్రభుత్వం 12 శాతం తక్కువ (లెస్)కు టెండర్ వేసిన ఒక ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ కంపెనీకి పనులను అప్పగించారు. 12 శాతం తక్కువకు కోట్‌చేయడంతో.. రూ. 222.87 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయినట్టుగా అప్పటి ప్రభుత్వం పేర్కొంది. ఆదా అయిన మొత్తన్ని మినహాయించుకుంటే.. రూ. 1548.24 కోట్లకే మిగిలిన పనులన్నీ పూర్తవుతాయని కూడా అప్పట్లో స్పష్టం చేశారు.

అదనపు పనుల పేరిట.. 206 శాతం పెంపు

కాంట్రాక్టరును మార్చిన తరువాత.. అసలు తతంగం మొదలయ్యింది. మొత్తం 41 పనులు సక్రమంగా జరగలేదని, అవన్నీ డిజైన్లకు తేడా ఉన్నాయని, వాటిని సరిచేయడానికి అదనంగా రూ. 914.59 కోట్లను కేటాయించారు. అలాగే అదనపు పనులనుకూడా చేయడానికి రూ. 669.48 కోట్లను కేటాయించారు. దీనికితోడు.. పోలవరం నిర్మాణంలో కీలకమైన అప్పర్ కాఫర్ డ్యాంలోని గ్యాప్ గ్యాప్ కోత నుంచి రక్షించే పనులను మెరుగుపర్చడానికి ఉద్దేశించి రూ. 1615.76 కోట్ల పనులను అదనంగా చేర్చారు.

దీనితో మొత్తం పనుల విలువ రూ. 4748.07 కోట్లకు చేరింది. కేవలం మూడేండ్ల కాలంలోనే పనుల వ్యయం 206 శాతం పెరిగి.. ఆ స్థాయికి చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే విషయం ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలోనూ స్పష్టంగా పొందుపర్చారు. ఏయే పనులకు ఎంతమేర అదనంగా నిధులను కేటాయించారనేది స్పష్టంగా పేర్కొన్నారు. ఇదంతా చూస్తే.. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 222.87 కోట్లు లాభం చేకూరింది అని చెబుతూ.. తెరవెనుక మాత్రం.. అదనంగా రూ. 3199.83 కోట్ల పనులను చేపట్టి.. బిల్లులు కూడా చెల్లించినట్టుగా స్పష్టమయ్యింది. గడిచిన మూడేండ్లలో మొత్తం 9 అదనపు ఒప్పందాలను (సప్లిమెంట్ అగ్రిమెంట్లు) కుదుర్చుకున్నట్టుగా తేలింది.

టెండర్లు పిలవలేదు

నిజానికి ప్రధాన పనుల విలువకు అదనంగా 10 శాతం పనులను చేర్చితే అదే కాంట్రాక్టరుకు అప్పగించవచ్చు. అంతకంటే పెరిగితే.. కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కానీ పోలవరం విషయంలో మాత్రం.. 206 శాతం పెరిగినప్పటికీ.. ఈ పనులన్నింటినీ రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టరుకే అప్పగించడం గమనార్హం. ఉదాహరణకు.. మనం ఇంటి నిర్మాణం చేస్తున్నామనుకుందాం. అందులో ఒక డోర్ నిర్మాణం అదనంగా జరిగితే.. ఇంటిని నిర్మిస్తున్న కాంట్రాక్టరుకే అప్పగిస్తే ఫరవా లేదు.

కానీ.. కిటికీ నిర్మాణం కోసం పనులు అప్పగించి.. ఆ తరువాత మొత్తం ఇంటి నిర్మాణం మొత్తాన్ని అదనపు పనులుగా పేర్కొంటూ కొత్తగా సదరు కాంట్రాక్టరుకు అప్పగిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ పోలవరం విషయంలోనూ ఇదే జరిగింది. కేవలం రూ. 1548 కోట్ల విలువైన అసలు పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త కాంట్రాక్టు కంపెనీకి అప్పగించారు. తరువాత ఏకంగా రూ. 3199 కోట్లకుపైగా విలువైన పనులను అదనపు పనులు అంటూ అప్పగించడం అంటే.. తెరవెనుక ఏం జరిగిందనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పైగా ఎలాంటి టెండర్లు పిలవకుండానే వీటిని కట్టబెట్టారు. వాస్తవానికి 10 శాతం కంటే ఎక్కువ పనులు అదనంగా ఉంటే కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం... 206 శాతం విలువైన పనులు అయినప్పటికీ.. కొత్తగా టెండర్లు పిలవలేదు. అందుకే దీనిపై లోతుగా విచారణ చేయాలనే డిమాండ్లు వినపడుతున్నాయి.

ఫలితం నిల్

పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు అయింది.   త్వం మారడం.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడడంతో.. ఏటికేడు పోల వరం నిర్మాణ వ్యయం పెరుగుతూ వస్తోంది. పైగా తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యయాన్ని పెంచుతూ పోతున్నారు.

దీనితో ప్రజాధనం దుర్వినియోగం కావడం.. పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలకు ప్రాజెక్టు ఫలితాలు అందడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. జరిగిన అవకతవకలపై విచారణ చేయకుంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట నిధుల వరద పారుతూనే ఉంటుందనటంతో అతిశయోక్తి లేదు.