జల ఉద్యమమే
- తెలంగాణ నీటి హక్కులను కొల్లగొడుతున్న ఏపీ
- జీఆర్‌ఎంబీ భేటీ ఎజెండా రాష్ట్ర హక్కులను కాలరాస్తుంది
- ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందో రేవంత్, ఉత్తమ్ చెప్పాలి
- అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీని రద్దుచేస్తాం
- ఇప్పుడు రెగ్యులరైజ్ చేయించుకున్న వాళ్లు నష్టపోవడం ఖాయం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): తెలంగాణ నీటి హక్కులకు మించిన మరో ప్రాధాన్యత మా పార్టీకి లేదని, నదీ జలాల్లో కేంద్రమైనా, రాష్ట్రమైనా నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని.. తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఈ జల ఉద్యమం వస్తదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేస్తే మరొక ఆందోళన తెలంగాణలో వస్తుందన్నా రు.
జీఆర్‌ఎంబీ సమావేశం ఎజెండా ను ఒప్పుకున్నారా? ఈ సమావేశానికి హాజరైతారా? హాజరైతే తెలంగాణ ప్రజల తరఫున ఏం చెప్తారు? అనే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్త మ్‌కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఎజెండాను ఒప్పుకొని ఎలా మీటింగ్‌కు హాజరవుతుందని, ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఈ సమావేశాన్ని బహిష్కరించాలన్నారు.
తెలంగాణ వ్యతిరేకి ఆదిత్య నాథ్ దాస్‌ని సలహాదారుగా పెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్య అని, తెలంగాణలో ఒక్క ఇంజనీర్ కూడా లేరా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చెప్పుచేతల్లోనే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని, చంద్రబాబు చెప్పుచేతల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలతో కొట్లాడిన తెలంగాణలో మరోసారి నీళ్ల దోపిడీకి తెలంగాణ గురవుతున్నదని, ఇదే జరిగితే కచ్చితంగా బీఆర్‌ఎస్ మరోసారి నీళ్ల కోసం ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
మేము లక్షల మంది రైతులతో వెళ్లి పంపులు ఆన్ చేస్తామంటేనే మహబూబ్‌నగర్ జిల్లాలో పంపులను ప్రభుత్వం ప్రారంభించిందని, మహబూబ్‌నగర్ జిల్లా అని, మా పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి పాలమూరు నీళ్లు ఇచ్చే సోయి లేదని మండిపడ్డారు. వర్షాలు పడి పోతిరెడ్డిపాడు ద్వారా పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తి పోసుకుంటే సీఎం కనీసం సోయి లేదని, ప్రధాన ప్రతిపక్షం ముళ్ళు కట్టెతో పొడిస్తేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది లేదంటే నిద్రపోతున్నదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ చేసినన్నీ యాగాలు ఎవరూ చేయలేదు..
యాగాలు చేస్తే తప్పు లేదు కానీ.. యాగాలతో పాటు రాష్ట్ర సీఎం తన బాధ్యతలు నిర్వహించాలని, ప్రజలకు సంబంధించి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన కష్టాలను పట్టించుకోవాలని హితవు పలికారు. దైవకృపకు మానవ ప్రయత్నం కూడా ఉంచేనే ఫలితం వస్తుందన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసినన్ని యాగాలు ఎవరూ చేయలేదని గుర్తు చేశారు. హరీష్‌రావు గుడికి వెళ్తే కాంగ్రెస్ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారని, క్షుద్ర పూజలంటూ, సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సిగ్గుపడాలన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం త్యాగాలు చేసినవాళ్ళమని, క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం మాకు లేదని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటామని, కాంగ్రెస్ లాగ పార్టీ క్షుద్ర రాజకీయాలు మాకు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీలాగా మేడిగడ్డ, చెక్ డ్యామ్‌లను ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదని పేర్కొన్నారు.
హైకోర్టు వ్యాఖ్యలు సీఎం అసమర్థత, వైఫల్యానికి నిదర్శనం..
ప్రభుత్వ అధికారులపైన నమ్మకం లేదు, ఆర్మీని ఈ రంగంలోకి దించుతామని అంత ఘాటుగా హైకోర్టు ఎప్పుడూ చెప్పలేదని, హైకోర్టు వ్యాఖ్యలు సీఎం అసమర్థతకు, వైఫల్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోను అంటే సీఎంకు న్యాయస్థానాల పైన ఉన్న గౌరవం ఏంటో తెలిసిపోయిందని మండిపడ్డారు. కోర్టులు చెప్పినా హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని, ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనా విధానాన్ని ప్రజాస్వామికవాదులు గుర్తించాలన్నారు.
రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పుకున్నట్లే రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలను విపత్తుల నుంచి రక్షించడానికి ఈవీడియం అనే సంస్థను పెట్టామని, దాని పేరు మార్చి ప్రజల్ని విపత్తుల్లోకి, విధ్వంసంలోకి నెట్టేలా హైడ్రాని తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలను కొట్టి పొందిన 2,500 ఎకరాల భూమిని సేకరించి వాటిని పెద్దలకు అమ్ముతామని ప్రభుత్వం చెబుతుందని, పేదలను కొట్టి పెద్దవాళ్లకు దోచిపెట్టడమే హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి చేస్తున్న పని అని విమర్శించారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల మందికి 58 జీవో ద్వారా పట్టాలు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క పట్టా అయినా ఇచ్చిందా? పైగా వేలాది మంది ఇళ్లను కూలగొట్టారని చెప్పారు.
అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీ రద్దు చేస్తాం..
హైదరాబాద్‌లోని 10,000 ఎకరాల విలువైన భూమి పారిశ్రామిక భూముల విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న రూ. 5 లక్షల కోట్ల స్కామ్ పైన రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తామని అన్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో ప్రజల సొమ్మును కాజేసే కుట్రను రేవంత్ రెడ్డి చేస్తున్నారని, ఈ అంశాన్ని ఎండగడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వేల కోట్ల రూపాయల సొమ్ములను దండుకునేందుకు తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రతి ఒక్క పారిశ్రామిక ఆర్గనైజేషన్‌కి లేఖలు రాస్తామని తెలిపారు.
హిల్ట్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజల సొమ్మును ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జేబులో వేసుకుంటుందో ప్రజలందరికీ అర్థమయ్యేలా లేఖల రూపంలో, ప్రజెంటేషన్‌ల రూపంలో ప్రజల ముందు ఉంచుతామన్నారు. దీంతోపాటు హైదరాబాద్ నగరంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజల విలువైన ఆస్తిని కాపాడేందుకు అనేక కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.
గతంలో బాంబే, ఇతర నగరాల్లో పారిశ్రామిక భూములను ప్రభుత్వం తీసుకొని తిరిగి రీడెవలప్మెంట్ చేసిన ఉదంతాలను కాదని ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా పాత భూముల ధరలకు కట్టబెట్టే కుట్రను రేవంత్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఈ పాలసీ వలన ఎవరైనా భూములను రెగ్యులరైజ్ చేయించుకుంటే భవిష్యత్తులో తీరని నష్టం జరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తామని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ఒక్క ఎకరం భూమి అందుబాటులో లేదని, చివరికి ఆట స్థలాలకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, చివరికి స్మశానాలకు కూడా భూములు లేని హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ వ్యక్తులకు 10,000 ఎకరాల భూమిని దోచిపెట్టడం తీరని ద్రోహమన్నారు.
ఒకప్పుడు ప్రజల ఆస్తిని పరిశ్రమల కోసం ఇచ్చారని, కేవలం పరిశ్రమలు మాత్రమే నడపాలని, అంతేకానీ మాల్స్ కట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ స్కామ్ పైన హైకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లి జరుగుతున్న అక్రమాలను వారి ముందు ఉంచుతామని తెలిపారు.
ప్రజల ఆస్తులపై కన్ను..
ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే కాకుండా ప్రజల వ్యక్తిగత ఆస్తుల పైన కూడా రేవంత్ రెడ్డి కన్నేసి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేవలం 16 లక్షల లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉంటే దాన్ని కోటి 20 లక్షలకు చేర్చి ప్రైవేట్ వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తూ భూ కబ్జా, బ్లాక్ మెయిలింగ్ దందాకు ప్రభుత్వం తెరలేపిందన్నారు. ఇప్పుడు కొత్తగా 22ఏ పేరుతో హైదరాబాద్ నగరంలోనూ తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసేలా లక్షల మందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.
కాలనీలకు కాలనీలను నిషేధిత జాబితాలో పెట్టి తమ సొంత కష్టార్జితంతో సంపాదించుకున్న 100 గజాలను కూడా అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. డబ్బులు ఇస్తేనే ఇన్‌ఓసీలు ఇచ్చేలా ఈ కొత్త నిర్ణయం తీసుకొని ప్రజల నుంచి ముక్కుపిండి భారీగా కోట్ల రూపాయలు వసూలు చేసే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నారన్నారు.
అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ధరణి పేరు మార్చి దాని ద్వారా నిషేధిత జాబితాలో పెట్టి అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపిస్తూ చెప్పలేనన్ని భూ అక్రమాలకు పాల్పడుతూ పొంగులేటి, రేవంత్ రెడ్డి కలిసి డబ్బులు పంచుకుంటున్నారని ఆరోపించారు. గ్రేహౌండ్స్ భూములను, మూసి భూములను కూడా వదలకుండా.. హెరిటేజ్ రాక్స్ ఉన్న రాయదుర్గం భూములను సైతం రేవంత్‌రెడ్డి వదిలిపెట్టడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన భూ కుంభకోణాలను, 22ఏ పేరిట జరుగుతున్న భూదోపిడిని, హిల్ట్ పాలసీ స్కామ్‌ని అన్నింటిని ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. గతంలో తాను చెప్పినట్లుగానే టీడీఆర్ హక్కులను అప్పనంగా కొని తర్వాత తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి పదుల రెట్లు అధిక ధరకి ఇప్పుడు బలవంతంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముకుంటూ వందల కోట్ల రూపాయల స్కామ్‌కి తెరలేపారని ఆరోపించారు.
ఒకప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ భూములను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల దగ్గర భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. నో బీఆర్‌ఎస్, నో ఎల్‌ఆర్‌ఎస్ అంటూ ఎన్నికలలో హామీ ఇచ్చి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.






