పద్ధతి లేని ప్రమోషన్లు
- కళాశాల విద్యలో వివాదం!
- సీనియారిటీని పక్కనపెట్టి జూనియర్లకు పదోన్నతులు!
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ కళాశాల విద్యలో పదోన్నతుల ప్రక్రియ వివాదంగా మారిం ది. డిగ్రీ కాలేజీల్లో సీనియర్లను కాదని జూనియర్లకు ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్లు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్లు ప్రమోషన్ పొం దేందుకు కొంతమంది అధికారులు సైతం సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా యి. ప్రమోషన్ల కోసం రూపొందించిన జాబితాలోనూ సీనియారిటీ ఉన్న అధ్యాపకులను కిందకు నెట్టి జూనియర్‌గా ఉన్న వారిని ఆ జాబితాలో పైకి తీసుకొచ్చి.. తమకు కావాల్సినవారిని ప్రమోషన్లు కల్పిస్తున్నట్లుగా పలువురు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.
అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌లకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి ప్రక్రియను కళాశాల విద్యాశాఖ చేపట్టింది. అయితే యూజీసీ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, పలు కోర్టు తీర్పులను సైతం లెక్కజేయకుండా అర్హతలేని వారికి అడ్డదారిలో పదోన్నతులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఫలితంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌ఈటీ), స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎస్‌ఎల్‌ఈటీ) లేదా పీహెచ్‌డీ వంటి అత్యున్నత విద్యార్హతలు ఉన్నవారు ప్రమోషన్లకు నోచుకోవడంలేదు.
వీరంతా ప్రమోషన్లు రాక.. దశాబ్దాలుగా సరైన గుర్తింపునకు నోచుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రధానంగా 1998 బ్యాచ్‌కు చెందిన అధ్యాపకుల సర్వీసు ముగిసిపోతున్నా.. వారిని సీనియారిటీ జాబితాలో వెనక్కి నెట్టి, కొంత మంది అనర్హులకు ప్రమోషన్లను కల్పిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. 1998 బ్యాచ్‌కు చెందిన వారిని ప్రమోషన్ జాబితాలో కిందకు పెట్టి, 2002, 2004 బ్యాచ్‌కు చెందిన వారిని పైకి తీసుకొస్తున్నట్లు బాధిత అధ్యాపకులు ఆరోపణలు చేస్తున్నారు.
వాస్తవానికి ప్రమోషన్ల ప్రక్రియను 1998 తర్వాత 2001, 2002, 2004, 2005గా చేపట్టాలి. ప్రస్తుతం 90 మందికిపైగా జూనియర్లు, అర్హతలేనివారు ఉన్నత స్థానాల్లో కొనసాగుతుండటంతో 1998 బ్యాచ్‌కు చెందిన అధ్యాపకులు దాదాపు 51 మంది ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు పొందకుండానే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.
అంతేకాకుండా 2011లో ఇతర జోన్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పది మందిని 27-09-2023 సీనియారిటీ జాబితా ద్వారా అక్రమంగా ప్రాధాన్యతనిచ్చి తెలంగాణ 2010 బ్యాచ్ సీనియర్లను పక్కనపెట్టి వారికే ప్రిన్సిపాల్స్‌గా చేశారు. ఉదాహరణకు ఓ అధ్యాపకుడు తన సీనియారిటీ ప్రకారం జాబితాలో 10 నుంచి 15 ప్లేస్‌లో ఉండాలి. కానీ ఆయనను 147 స్థానంలో ఉంచి, జూనియర్లు అయిన వారిని పైకి పెట్టినట్లుగా ఆరోపణలున్నాయి.
కోటరీ గుప్పెట్లో..
కళాశాల విద్యలో కోటరీ గుప్పెట్లోనే పదోన్నతుల ప్రక్రియ నడుస్తోందని కొందరు అధ్యాపకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అర్హత ఉన్నా ప్రమోషన్ జాబితాలో పేరు రావాలంటే పెద్ద మొత్తంలో అమ్యామ్యాలు సమర్పించుకోవాల్సి వస్తోందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ వివాదం కళాశాల కమిషనరేట్‌కు చేరడంతో ఇప్పటికే సిద్ధమైన సీనియారిటీ జాబితాను పునఃపరిశీలన చేసే పనిలో ఉన్నట్లుగా సమాచారం.
7-3-2022 ప్రభుత్వం జారీచేసిన మెమో, తెలంగాణ సబార్డినేట్ రూల్స్ (1996) ప్రకారం 1998 బ్యాచ్ అర్హులైన లెక్చరర్లకు సరైనా సీనియారిటీ కల్పిస్తూ సమగ్ర సీనియారిటీ జాబితాను వెంటనే సవరించాలని క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ (క్యూజీడీఎల్‌ఏ) ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తోంది.
సీనియారిటీ వివాదం పరిష్కారమయ్యే వరకు ప్రిన్సిపాల్ పదోన్నతుల డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతున్నారు. అదేవిధంగా తమకు నచ్చినట్లు అక్రమంగా జాబితాను తారుమారు చేసిన కొందరు కళాశాల విద్యాశాఖ అధికారులు, సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని క్యూజీడీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. టీఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.






