09-11-2025 04:35:09 PM
ఎర్రగడ్డ ప్రజలకు విజ్ఞప్తి
సనత్‌నగర్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్ నివాసితులకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. పోలింగ్ జరగబోయే మంగళవారం దృష్ట్యా, వచ్చే 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు పూర్తి స్థాయిలో నిషేధించామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఇండ్లు, హోటళ్లు, లాడ్జీలలో స్థానికేతరులను బసకు అనుమతించరాదని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా డివిజన్‌లో సౌండ్ బాక్సులు, మైక్‌ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు.
సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు నియోజకవర్గం మొత్తంలో సెక్షన్ 163 BNSS అమల్లో ఉంటుందని, ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు, కళ్ళు కాంపౌండ్లు, బార్లలో విక్రయాలు నిలిపివేయాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు అవి మూసివేయబడతాయని పింగిలి నరేష్ రెడ్డి ఏసీపీ, బాలానగర్ డివిజన్ స్పష్టం చేశారు.