15 March, 2026 | 4:23 AM

ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు ఉధృతం

15-03-2026 01:24 AM

సౌదీలోని యూఎస్ బేస్‌పై ఇరాన్ దాడి

అమెరికా ఐదు రీఫ్యూయలింగ్ ఫ్లుట్లై ధ్వంసం

ఇరాక్‌లోని అగ్రరాజ్యం ఎంబసీపై క్షిపణి దాడి

ధ్వంసమైన హెలిప్యాడ్ 

యూఏఈలో డ్రోన్ దాడి.. అడ్డుకున్న వైమానిక సైన్యం

శకలాలు పడి చమురు శుద్ధి కర్మాగారంలో అగ్ని ప్రమాదం

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు

రియాద్/బాగ్దాద్/దుబాయ్, మార్చి 14: యూఎస్ ఇరాన్ మధ్య జరుగుతన్న యుద్ధం వల్ల పశ్చిమ ఆసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులను ఉధృతం చేస్తోంది. సౌదీ, బాగ్దాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్‌లోని ఫుజైరా ఎమిరేట్‌లో ఇరాన్ శనివారం కూడా దాడులు కొనసాగించింది. సౌదీబేస్‌పై ఇరా న్ చేసిన దాడిలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణిని ప్రయోగించింది.

ఈ దాడిలో హెలిప్యాడ్ దెబ్బతిన్నది. భారీ పేలుడు అనంతరం ఈ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్‌లోని ఫుజైరా ఎమిరేట్‌లో ఇరాన్ డ్రోన్ దాడి చేయగా దానిని వైమానికదళాలు అడ్డుకున్నాయి. డ్రోన్ శకలాలు పడటంతో చమురు శుద్ధి కర్మాగారం ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇటీవల సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దా డులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు రీ ఫ్యూ యలింగ్ విమానాలు ధ్వంసమైనట్టు యూఎస్ అధికారులు తెలిపారని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.

సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడుల్లో ఐదు కేసీ-135 రీ ఫ్యూయలింగ్ విమానాల ట్యాంకర్లు దెబ్బతిన్నాయని, విమానాలు పాక్షికంగా ధ్వసంమయ్యాయని తెలిపింది. దెబ్బతిన్న విమానాలకు మరమ్మతులు కొనసాగుతున్నాయని, ఈ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు వెల్లడించినట్టు పేర్కొం ది. ఈ విమానాల ధ్వంసంపై యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పందించలేదు. కాగా, ఇరాక్‌లో కూడా అమెరికా రిఫ్యూయలింగ్ విమానం ఒకటి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి

అమెరికా- సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకారదాడులు కొనసాగి స్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణిని ప్రయో గించింది. శనివారం ఉదయం భారీ పేలుడు అనంతరం అమెరికా ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్టు అధికారులు తెలిపారు. ఎంబసీ కాంపౌండ్‌లోని హెలిప్యాడ్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని, హెలిప్యాడ్ దెబ్బతిందని ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.

ఎంబసీ కాంప్లెక్స్‌పై డ్రోన్ దాడి జరిగినట్టు సెక్యూరిటీ అధికారి ఒకరు చెప్పగా, ప్రొజక్టైల్ దాడి జరిగినట్టు మరో భద్రతాధికారి చెప్పారు. అయితే ఈ ఘటనపై అమెరికా ఎంబసీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా- సంయుక్తంగా దాడులు ప్రారంభించినప్పటి నుంచి బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి జరపడం ఇది రెండోసారి. ఇరాక్‌లో టెహ్రాన్‌కు మద్దతుగా నిలుస్తున్న సాయుధ గ్రూపులు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు.

యూఏఈలో డ్రోన్ దాడి

యూఎస్ ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్‌లోని ఫుజైరా ఎమిరేట్‌లో శనివారం డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. గగనతల రక్షణ వ్యవస్థలు ఒక డ్రోన్ ను అడ్డుకున్న తరువాత దాని శకలాలు నేలపై పడటంతో చమురు శుద్ధి కర్మాగారం ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు ఫుజైరా మీడియా వెల్లడించింది.

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. అధికారుల కథనం ప్రకారం.. డ్రోన్‌ను గగనతలంలోనే అడ్డుకోవడంతో అది పేలిపోయి కొన్ని భాగాలు నేలపై పడినట్లు తెలుస్తోంది. దాని శకలాలు చమురు పరిశ్రమ ప్రాంతంలో పడటంతో అక్కడ మంటలు చెలరేగాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రాంతాన్ని భద్రపరిచినట్లు తెలిపారు.