15 March, 2026 | 4:16 AM

ఆ పార్టీ దేశ పౌరుల్లో భయం సృష్టిస్తోంది

15-03-2026 01:26 AM

యుద్ధం వేళ నన్ను వేధించాలని చూస్తోంది

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం

దిస్పూర్, మార్చి 14: పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం వల్ల భారతీయుల్లో భ యాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం అస్సోంలోని సిల్చార్‌లో మోదీ పర్యటించా రు. బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్షపార్టీలపై ఆగ్రహించారు. యూఎస్ ఇరాన్ మధ్య నడస్తున్న యుద్ధం నేపథ్యంలో దేశ పౌరులపై ప్రభావం పడకుండా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

ఇలాంటి కీలక సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన కాంగ్రెస్ జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో మరోసారి విఫలమైం దన్నారు. దేశంలో భయాందోళనలు రేకెత్తించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోందని ఆరోపించారు. ఇలా భయాలు పుట్టించి, తనను వేధించాలని చూస్తున్నారని కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేశారు. అస్సోం ప్రజలు ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ను ఎప్పుడో తరిమికొట్టారని అన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ప్రతి రాష్ట్రం ఆ పార్టీకి గుణపాఠం చెప్పనుందన్నారు.