దేవుడి మాన్యాల మీద రేవంత్ కళ్లు
- అల్లుడి క్రషర్ దందా కోసం దేవుడి భూములను లాక్కుంటారా
- విశాఖ శారద పీఠం, రాజ శ్యామల ఆలయాన్ని కూల్చేందుకు కుట్ర
- కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అంటే. గుళ్లు, గోపురాలు కూల్చడమేనా?
- ఆలయానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్/మణికొండ, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు దేవుడి మాన్యాల మీద పడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లతో పాటు ఇప్పుడు దేవాలయాలు, మఠాలను సైతం కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కోకాపేట్ నియో పోలిస్‌లోని విశాఖ శారద పీఠం, రాజ శ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీశ్‌రావు శనివారం హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియా తో మాట్లాడారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన తయారైందని, అడ్డగోలు వ్యవహారాలకు, అక్రమాలకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారిందని విమర్శించారు.
2019లో కేసీఆర్ ప్రభుత్వంలో కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారద పీఠానికి చట్టబద్ధంగా క్యాబినెట్ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించామని, పీఠం నిర్వాహకులు ప్రభు త్వానికి రూ.1.5 కోట్లు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడంతోపాటు హెచ్‌ఎండీఏకు రూ.23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా అంటూ.. కేసీఆర్ కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చడమేనా రేవంత్‌రెడ్డి ఉద్దేశమని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చారని, ఖమ్మంలో ఇళ్లు కూల్చి 800 మందిని రోడ్డున పడేశారని మండిపడ్డారు. మీ పాలనలో కూల్చడమే తప్పా నిర్మాణం లేదా అని ప్రశ్నించారు. వాటర్ వర్క్స్ కట్టాలంటే ఈ దేవాలయం స్థలమే దొరికిందా.. సరిగ్గా ఈ ఆలయానికి రోడ్డు అవతలే సర్వే నెంబర్ 239, 240 లలో 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా, వాటర్ వరక్స్ అక్కడ కట్టుకోవచ్చు కదా అని నిలదీశారు.
ఆ 17 ఎకరాల భూమిని రేవంత్‌రెడ్డి తన అల్లుడికి, మేనల్లుళ్లకు, వాళ్ల అనుచరులకు భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఓపెన్ ఆక్షన్ వేస్తే ప్రభుత్వానికి వందల కోట్లు వచ్చేవని, కానీ లోపల లోపల నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ తన అల్లుడి కోసం రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు
హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం ఓఆర్‌ఆర్‌కు కిలోమీటరు లోపల ఎలాంటి క్రషర్లు ఉండకూడదని, కానీ రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం ఇక్కడ ఏకంగా 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారని మండిపడ్డారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా రాత్రి వేళ వందలాది మంది పోలీసులు, ఎమ్మార్వోలు వచ్చి ఆలయం వద్ద పీఠాధిపతిని, నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తారా అని నిలదీశారు.
క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులతో మాట్లాడే కనీస సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదా అన్నారు. క్యాబినెట్‌లో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు సీఎంపై ఒత్తిడి తెచ్చి ఈ దేవాలయాన్ని, మఠాన్ని కూల్చకుండా కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ఈ దేవాలయ పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ పార్టీ భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుందని స్పష్టం చేశారు.




