29 June, 2026 | 2:04 AM

మోదీ, చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారు

29-06-2026 12:00 AM
  1. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 
  2. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారు 
  3. సభ్యత్వ నమోదు, ఓటర్ రివిజన్‌పై కార్యకర్తలకు దిశానిర్దేశం
  4. మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బాన్సువాడ, జూన్ 28 (విజయ క్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తు న్నారని, రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ లో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇన్సెంటివ్ ఓటర్ రివిజన్ ప్రోగ్ప్రా కార్యకర్తలు, నాయకులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.  నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ జడ్పీ చైర్మన్లు దఫెదార్ రాజు, విఠల్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని, పదేళ్లు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు.

మోసపూరిత హామీలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ సగం మందికే చేశారని, యూరియా కొరత ఉందని, రైతు బంధు, భరోసాలో మోసం చేశారని ఆరోపించారు. మహిళలకు 2500, తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాల హామీలు నెరవేరలేదని, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేదే రాష్ట్రంలో డిమాండ్ అని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చిందని, బీజేపీ ఎంపీ తెలంగాణను మరో పాకిస్తాన్గా పోల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోచారం వెళ్లినా బాన్సువాడలో బీఆర్‌ఎస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని, కేటీఆర్ ఆయనను పార్టీలోకి తీసుకోమని చెప్పారని తెలిపారు.     

బాన్సువాడ నియోజకవర్గంలోని కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళని బలం బలగం కార్యకర్తలేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఓటరు నమోదులో చురుకుగా పాల్గొని ఓటు నమోదు చేయించాలని సైనికులుగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బీజేపీ ఎన్నికలు ఉన్నచోట ఎస్‌ఐఆర్ పెడుతోందని, ఓటర్ల పట్ల అప్రమత్తంగా ఉండి ఓట్లు తొలగించకుండా చూడాలని సూచించారు.

24 గంటల కరెంట్ లేదని, రైతులు మోసపోయారని, రేపు ఎన్నికలు వస్తే బాన్సువాడలో బీఆర్‌ఎస్ గెలుస్తుందని అన్నారు. రేవంత్కు రైతులు, ప్రజల పట్ల గౌరవం లేదని, బడ్జెట్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. సభ్యత్వ నమోదు జిల్లా ఇంచార్జ్ విజి గౌడ్ మాట్లాడుతూ, డిజిటల్ సభ్యత్వం తీసుకోవాలని, తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ తోట ఆగయ్య, జిల్లా ఇంచార్జ్ విజి గౌడ్, అంజిరెడ్డి, జుబేర్, నార్ల రత్నకుమార్, యలమంచిలి శ్రీనివాస్, షేక్ అక్బర్, బాడీ శ్రీను, మోచి గణేష్, సాయిబాబా, ఫెరోజ్, అతిఫ్, ఇసాక్, సుధాకర్ యాదవ్ , నర్సింలు గౌడ్ పాల్గొన్నారు. అన్ని మండలాలు, గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.