17 July, 2026 | 4:55 AM

రేవంత్ స్టాంప్!

06-06-2024 12:38 AM

త్వరలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ప్రక్షాళన

పదేండ్లు తిష్ట వేసినవారికి త్వరలోనే స్థాన చలనం!

ఆఫీసు సబార్డినేట్ నుంచి డీఐజీల వరకు 

రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం

ఇప్పటికే పూర్తయిన కసరత్తు 

సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన తుది ఫైల్

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  ముగిసిన వెంటనే నిర్ణయం

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 5 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. గత పదేండ్లుగా ఒకే కుర్చీలో తిష్టవేసి కూర్చున్న అధికారులపై బదిలీ వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ శాఖలో ఆఫీసు సబార్డినేట్ మొదలుకొని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వరకు బదిలీ చేయాలని నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనకు చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ శనివారం వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి సోమవారం రోజు రిజిస్ట్రేషన్ శాఖలోని అన్ని విభాగాల అధికారులను, సిబ్బందిని ప్రభుత్వం సంపూర్ణం గా బదిలీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖది కీలక పాత్ర. అయితే ఈ శాఖలో లంచావతారాల సంఖ్య కూడా ఎక్కువే.

అయితే గతంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్లను అడ్డం పెట్టుకొని చేసిన మియాపూర్ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖలో అవినీతి అధికారులపై వేటు వేయడంతో పాటు మెజార్టీ సబ్ రిజిస్ట్రార్లను బదిలీచేశారు. అనంతరం 2023లో సుమారు 60 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. కానీ గత పదేండ్లలో ఏనాడు కూడా రిజిస్ట్రేషన్ శాఖ లో పూర్తిస్థాయిలో బదిలీలు జరగలేదు. దీంతో మెజార్టీ సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, అడిట్ రిజిస్ట్రార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల ఏసీబీ దాడులలో జిల్లా రిజిస్ట్రార్ మొదలుకొని సబ్ రిజిస్ట్రార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. అలాగే కొందరు జిల్లా రిజిస్ట్రార్లు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్లుగా నియమించుకొని అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు సర్వసాధారణం అయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సంపూర్ణ బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘విజయక్రాంతి’కి తెలిపారు. డీఐజీలను, జిల్లా రిజిస్ట్రార్లను రాష్ట్రస్థాయిలో, సబ్ రిజిస్ట్రార్లను జోన్ల ప్రకారం, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను, ఆఫీసు సబార్డినేట్‌లను మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా పరిధిలో బదిలీచేసే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. 

సగానికి సగం ఖాళీలే

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం సాంక్షన్ పోస్టులు సుమారు 11 వందల వరకు ఉన్నాయి. కానీ ఇందులో సగం ఖాళీలే ఉన్నాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలిపి కేవలం 600 మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారని, ఇందులోను అనారోగ్య కారణాలతో పాటు ఏసీబీ కేసులలో చిక్కి 25 మంది వరకు రావడం లేదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నప్పటికీ కేవలం 22 మంది మాత్రమే జిల్లా రిజిస్ట్రార్లు ఉన్నారు.

మిగిలిన జిల్లాలలో ఇంచార్జులతో కాలం వెల్లదీస్తున్నారు. మొత్తం 142 మంది సబ్ రిజిస్ట్రార్లు ఉండగా, సుమారు 100 మంది మాత్రమే ఉన్నారని, మిగిలిన 42 మంది సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను సబ్ రిజిస్ట్రార్లుగా నియమించుకొని కాలం వెల్లదీస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ జనరల్‌గా ఆరుగురు అధికారులున్నారు. ప్రభుత్వం వీరిపై కూడా బదిలీ వేటు వేయనుంది. అలాగే ఆడిట్ రిజిస్ట్రార్లతో పాటు ఆ శాఖలోని అన్ని విభాగాల అధికారులను బదిలీ చేయనుండటంతో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులలో బదిలీ అలజడి నెలకొంది. 

ఫోకల్ పోస్టుల కోసం క్యూ

రిజిస్ట్రేషన్ శాఖలో మెజార్టీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తారనేది బహిరంగ రహస్యం. ఈ క్రమంలోనే ఎక్కువ రెవెన్యూ వచ్చే పోస్టులకు ఆ శాఖలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే బదిలీల నేప థ్యంలో తమకు ఫోకల్ పోస్టులలో పోస్టింగ్ ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ కొంత మంది అధికారులు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులు కోరుకుంటున్న ప్రభుత్వం పైరవీలకు స్థానం కల్పిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.