మినీ ట్రావెల్ బస్సు బోల్తా
- 15 మంది యాత్రికులకు గాయాలు
మెదక్ జిల్లా నార్సింగి వద్ద ఘటన
మెదక్, జూన్ 5 (విజయక్రాంతి): మినీ ట్రావెల్ బస్సు బోల్తాపడి 15 మంది యాత్రికులకు గాయాలైన ఘటన మెదక్ జిల్లా నార్సింగి వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, హైదరాబాద్‌కు చెందిన 21 మంది ప్రయాణికులు గత నెల 24వ తేదీన రైలులో కాశీ క్షేత్రానికి వెళ్లారు. తిరిగి రావడానికి రైల్ టికెట్లు దొరకకపోవడంతో లక్నోలో మినీ ట్రావెల్ బస్సును మాట్లాడుకున్నారు. తిరిగి వస్తుండగా బుధవారం నార్సింగి మండలం వల్లూరు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నార్సింగి ఎస్సై హైమద్, పోలీసులు బోల్తాపడిన ట్రావెల్ బస్సును రోడ్డు పక్కకు తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.






