22 April, 2026 | 2:24 AM

రాహుల్ స్థానం కోసం రేవంత్ ఆరాటం

22-04-2026 12:55 AM
  1. మహిళా బిల్లును అడ్డుకొని తప్పుచేశారు
  2. ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకుంటే బాగుండేది
  3. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్థానాన్ని ఆక్రమించాలని తాపత్రయపడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మంగళవారం బండి సంజయ్ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను అడ్డుకుని ఏదో గొప్ప పని చేసినట్లు రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అన్నారు. ప్రజలంతా సీఎంను ఛీదరించుకుంటున్నారనే సంగతి మర్చిపోయారని, కనీసం ఇంటెలిజెన్స్ నుంచి సమా చారం తెప్పించుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లును అడ్డుకుని రేవంత్ రెడ్డి, స్టాలిన్ సహా విపక్షాలు పెద్ద తప్పు చేశాయన్నారు.

దేశంలో 52 కోట్ల జనాభా ఉన్నప్పు డు 543 పార్లమెంట్ సీట్లు ఉండాలని నిర్ణయించా రని, నేటికీ అదే కొనసాగుతోందన్నారు. దేశ జనా భా 140 కోట్లు దాటిన నేపథ్యంలో ఎంపీ సీట్ల సంఖ్యను 816 ఎంపీ సీట్లు చేయాలని మోదీ నిర్ణయించారని అన్నారు. దక్షిణాదికి న్యాయం చేస్తామని చెబితే.. అడ్డుకున్నది ఎవరు అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.