టార్గెట్ జెన్ జీ
- యువతకు చేరువయ్యేలా బీజేపీ వ్యూహం
- ఆకాంక్షలు, సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు కార్యాచరణ
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. ముఖ్యంగా జెన్- జీలను లక్ష్యంగా చేసుకుని పార్టీ జాతీయ నాయకత్వం కొత్త రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. పార్టీ కార్యక్రమాలు, భాష, ప్రచార శైలి అంతా కొత్త తరం యువతకు చేరువయ్యేలా ఉండాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
యువత ఆకాంక్షలు ఏంటి? వారి సమస్యలు, భవిష్యత్తుపై వారి అంచనాలు ఏంటి?, రాజకీయాలపై అభిప్రాయాలు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవాలని పార్టీ భావిస్తోంది. జెన్ జీను ఆకర్షించే లా పార్టీ ఉద్యమాలు, కార్యాచరణ ఉండాలని ఇటీవల ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీ కూడా రంగంలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
యువతే కీలకం
ఇప్పటివరకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు యువత, నిరుద్యో గం, పేపర్ లీకేజీల వంటి అంశాలను లేవనెత్తుతూ జెన్ -జీని ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు బీజేపీకి కూడా ఈ విధానాన్నే ఎం చుకోబోతుంది. 2029 పోరులో గెలుపోటములను నిర్ణయించేది జెన్- జీ ఓటర్లే కాబోతున్నారు. అందుకే వారికి దగ్గరయ్యేలా కార్యాచరణను రూపొందిస్తోంది. నేతలందరూ జెన్ జీల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది.
ఢిల్లీలో జెన్ జీలు చేపట్టిన ఉద్యమానికి తొలుత బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నష్టాన్ని ముందే పసిగట్టిన ఆర్‌ఎస్‌ఎస్ వారికి మద్దతుగా ప్రకటన చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ కలుగజేసుకోవడంతో ఇక బీజేపీ నాయకత్వం కూడా వెనక్కి తగ్గి విద్యార్థుల డిమాండ్లను ఒప్పుకుంది. జెన్ జీలను దూరం చేసుకోకుండా వారికి ఎలా దగ్గరవ్వాలో ఎత్తులు వేస్తోంది.
కొత్త కార్యక్రమాలు..
యువతతో నిరంతరం సంబంధాలను పెంచుకోవాలని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. రాబోయే రోజుల్లో యువతను పార్టీలో చేర్చుకోవడం, వారికోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం వంటి అంశాలను ఎంచుకోవాలని చెప్పినట్లుగా తెలిసింది. దేశవ్యాప్తంగా పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగా యువతను మరింతగా చేరుకునేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
యువతతో ప్రత్యక్షంగా, నిరంతరం సంభాషించేందుకు బీజేపీ త్వరలో జెన్ జీ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలిసింది. ఈ కార్యక్రమం ద్వారా యువత ఆకాంక్షలు, సమస్యలు, అభిప్రాయాలు, భవిష్యత్ అంచనాలను తెలుసుకోవడంపై పార్టీ దృష్టి పెట్టనుంది. అలాగే యువత నేరుగా బీజేపీ నేతలతో మాట్లాడేందుకు.. తమ సమస్యలు, అభిప్రాయాలను పంచుకునేందుకు వేదిక కల్పించనున్నట్లు తెలిసింది.
చర్చలు, పరస్పర సమావేశాలు, ఇతర కార్యక్రమాల ద్వారా యువ ఓటర్లతో పార్టీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా యువతతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకోవడం, వారి ఆలోచనలు, సమస్యలను తెలుసుకోవడం, పార్టీ కార్యకలాపాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.
ఈసారి బీజేపీ యువ ఓటర్లపై గట్టిగానే దృష్టి సారించింది. 2024 ఎన్నికల్లో 18-28 ఏళ్ల మధ్య ఉన్న మొదటిసారి ఓటర్లు, జెన్- జీ ఓటర్లలో పార్టీకి మద్దతు వారి అంచనాలకు తగ్గట్టుగా లేదు. అందుకే జెన్- జీ కేవలం ఓటు బ్యాంక్ కాదు, భవిష్యత్తు భాగస్వాములు అనే నినాదంతో వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాన్ని బీజేపీ చేయనుంది.






