25 August, 2026 | 2:38 AM

ఏమిటీ వివక్ష?

25-08-2026 01:38 AM

గుజరాత్‌కు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా? 

  1. తెలంగాణ అభివృద్ధిపై కుట్రలు 
  2. నా అమెరికా పర్యటనను బీజేపీ నేతలే అడ్డుకున్నారు 
  3. గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రధాని మోదీ
  4. నేను కాంగ్రెస్ సీఎంను కావడమే కారణమా? 
  5. హరీశ్‌రావు, కేటీఆర్, కవిత అమెరికా టూర్లకు వెళ్తున్నారుగా!  
  6. కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తన అమెరికా పర్యటనను అడ్డుకోవడం గుజరాత్ ఆధిపత్యానికి నిదర్శనమని అన్నారు. ఇది ఆక్షేపనీయమని చెప్పారు. కేంద్రం రాజకీయ కారణాలతో వ్యవహరించిందని, ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని రేవంత్ అన్నారు.

కేంద్రప్రభుత్వం అనుసరించిన ఈ వైఖరిని అందరూ ఖండంచాలని సీఎం పులుపునిచ్చారు. ప్రధాని మోదీ దేశానికి ప్రధానిగా కాకుండా గుజరాత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని, భారత్‌కు వచ్చే పెట్టుబుడులన్నీ గుజరాత్‌కే మళ్లించాలని మోదీ చూ స్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనను అడ్డుకున్నా .. తన లక్ష్యాన్ని మాత్రం అడ్డుకోలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 పేరిట పెట్టుబడల సదస్సును డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌లో సిటీలో నిర్వ హిస్తున్నామని, ఇందులో హైదరాబాద్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తామని సీఎం తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

‘రాష్ట్రాల కలయికనే కేంద్ర ప్రభు త్వం. ఇది భారత దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి, విద్య, క్రీడలు, పెట్టుబడులు లక్ష్యంగా మా విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నాం. తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుని ముం దుకెళుతోంది’ అని సీఎం వివరించారు. తాను తెలంగాణ కు చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కావడమే విదేశీ పర్యటనకు అడ్డుకోవడానికి కారణమన్నారు.

ఒక సీఎం విదేశీ పర్యటనకు వెళ్లితే విదేశీ రాయబారులు వెంటనే ఉంటారని, ప్రతి కార్యక్రమాన్ని వారు పర్యవేక్షిస్తారని తెలిపారు. అమెరికా పర్యటనలో మమ్దానీని తను కలుసుకుంటే వచ్చిన నష్టమేంటని సీఎం ప్రశ్నించారు. మమ్దానీ న్యూ యార్క్ ప్రజలు ఎన్నుకున్న మేయరని, ఆయనేమీ అసాంఘిక శక్తి కాదని సీఎం పేర్కొన్నారు. 

విచక్షణ కోల్పోయి విమర్శలు

 ‘విదేశీ పర్యటనకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు పూర్తి సమాచారం అందించాం. విదేశీ వ్యవహారా ల మంత్రిత్వశాఖ .. ఇంగ్లాండ్‌కు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. ఈ విషయంలో కేంద్రం వైఖరిని అందరూ తప్పుపట్టారు. నా పర్యటనను తిరస్కరించడమే కాకుండా బీజేపీ నాయకులు రాజకీయం గా నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు విచక్షణ కోల్పోయి ప్రభుత్వంపై, అధికారిక పర్యటనపై తప్పుడు ప్రకటనలు చేశారు.

బీజేపీ వైఖరిపై రాజకీయ అంశాలను నేను ప్రస్తావించదలచు కోలేదు. ఇది రెండు ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించాం. రాజకీయపరమైన నిర్ణయాలతో పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఆ రాజకీయ కారణాలు ఏమిటో ప్రధాని మోదీ చెప్పాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన అధికారిక పర్యటనపై బీజేపీ నేతలు కేంద్రానికి అవాస్తవాలు చెప్పి తప్పుదోవ పట్టించారని సీఎం మండిపడ్డారు. 

గుజరాత్ సీఎంకు ఎలా అనుమతిచ్చారు..? 

వైబ్రంట్ గుజరాత్ అని పెట్టుబడుల కోసం ఆగస్టు 17 నుంచి 28 వరకు అమెరికా, కెనడాలలో గుజరాత్ ముఖ్యమంత్రి పర్యటించారని, ఈ పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రిని అనుమతించిన కేంద్రం, తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా అమెరికాలో పర్యటించాలను కుంటే తమను అడ్డుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. గుజారత్ సీఎం అమెరికాలో ర్యాలీలు చేశారని, పెట్టుబడుల కోసం ఎనిమిది రోజులు అక్కడే ఉన్నారని సీఎం గుర్తు ఏశారు.

‘నా విదేశీ పర్యటనలో విష యం లేదనుకుంటే ఇంగ్లాండ్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారు? అమెరికాకు ఎందుకు తిరస్కరించారు? మహాత్మాగాంధీ, అంబేద్కర్ ఇంగ్లాండ్‌లో చదువుకుని దేశానికి దార్శనికులుగా మారారు. ఆర్థికంగా వెనకబడిన వారు విదేశాల్లో చదువుకునే పరిస్థితి ఉండదు.

విదేశీ చదువులను, క్రీడలను ఇక్కడికి తీసుకురావాలని మేం ప్రయత్నిస్తు న్నాం. ఇందుకు విదేశీ పర్యటనలు ఉపయోగపడుతాయని భావించాం. ప్రధాని ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధానిగా వ్యవహరించడం లేదు ’ అని విమర్శించారు. 

తెలంగాణకు అవమానం..

‘నా విదేశీపర్యట అడ్డుకోవడమంటే.. రేవంత్‌రెడ్డికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యా యం. ఇది రాజకీయ వివక్షనే. దీనిని రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది. గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే నా పర్యటనను కేంద్రం అడ్డుకుంది తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను కేంద్రం అడ్డుకోవడమంటే తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించడమే. కేంద్రం వైఖరి చూస్తోంటే స్పష్టంగా తెలంగాణపై వివక్ష కనిపిస్తోంది. మా ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తారు.

మేమంతా కేంద్రం వైఖరిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఇది ఫెడరల్ సూర్తికి విరుద్ధం’ అని సీఎం విమర్శించారు. తన పర్యటను అడ్డుకోవడంపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ శ్రేణులతోపాటు విద్య, క్రీడల విధానాలు, పెట్టుబడలు విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతకు మేలు కులుగుతుందని నమ్మే వారంతా తప్పుపట్టారని సీఎం తెలిపా రు. తెలంగాణ బీజేపీ ఎంపీలు గుజరాత్‌కు సపోర్టు చేస్తారా..? తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తారా..? అనేది తేల్చుకోవాలని సీఎం హితవు పలికారు.   

పెట్టుబడులపై ఆవేదన..

‘విదేశీపర్యటకు సంబంధించి ముఖ్యమంత్రి సరైన వివరాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఇది అధికారిక పర్యటన. మా కార్యక్రమాలు అన్నీ భారత రాయబార కార్యాలయం పర్యవేక్షణలో జరుగుతాయి. ఇది చాటుమాటుగా జరిగే వ్యవహారం కాదు. అన్ని వివరాలను విదేశీ వ్యవహారా ల శాఖకు అందించాం. తెలంగాణ అంటే మోదీకి వివక్ష.. చిన్న చూపు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్ర. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉం డొచ్చు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. 

కేంద్రం వైఖరి సత్సంబంధాలను దెబ్బతీసేలా ఉంది. ప్రధాని మోదీ, బీజేపీ ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చు కానీ తెలంగాణ సీఎంగా నా పర్యటనను అడ్డుకుంటారట. కేంద్రం వైఖరితో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతాయన్నదే మా ఆవేదన. తెలంగాణ అభివృద్ధి కోసం కచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం’ అని సీఎం తెలిపారు.

మోదీ పాక్‌కు వెళ్లొచ్చా..? 

నరేంద్ర మోదీ ప్రధానిగా పాకిస్తాన్ వెళ్లి.. ఆయన మిత్రుడితో కలిసి బిర్యాని తినిరాలేదా..? మేం మాత్రం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లకూడదా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్, కవిత పిల్లలు విదేశాల్లో చదవుకుంటున్నారని, వారి అమెరికా పర్యటలకు కేంద్రం అనుమతులు ఇస్తోందన్నారు. సీఎంగా నా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు’ అని అన్నారు.

తాను హార్వర్డ్ యూనివర్సిటిలో చదివానని, ఒప్పందాల విషయంలో అమెరికా నుంచి తనకు ఆహ్వానం ఉందని తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రజాస్వామ్యం సన్నగిల్లిందని, నిరంకుశత్వం పెరిగిందన్నారు. మోదీ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని, ఆయన వైఖరితో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటున్నాయని విమర్శించారు.   

 పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

  • కొండా సురేఖ, సుస్మిత వివాదంపై సీఎం స్పందన

మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మితకు సంబంధించిన వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానంగా చెప్పారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీ (డిసిప్లినరీ కమిటీ) పరిశీలిస్తోందని తెలిపారు.

పార్టీలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా నాయకులైనా.. కార్యకర్తలైనా ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే అని ఆయన తేల్చిచెప్పారు. అదే సమయంలో పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి తాను బహిరంగంగా మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు లేదా అభిప్రాయాలు ఉంటే పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలని, క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.