calender_icon.png 4 February, 2026 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుడిఎడమలు దగా!

04-02-2026 02:31:33 AM

సింగరేణి కేసీఆర్రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్

  1. ఆ రెండు పార్టీల వల్లే సింగరేణి భ్రష్టు పట్టింది
  2. నైనీ బొగ్గు గనుల వ్యవహారంలో రెండు వర్గాలుగా మంత్రులు 
  3. యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌కు త్వరలో ప్రధాని మోదీతో భూమిపూజ
  4. ఉచితాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే కేంద్ర బడ్జెట్
  5. విలేఖరుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): నైనీ బొగ్గు గనుల వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వల్లే భ్రష్టు పట్టిందని ఆరో పించారు. సింగరేణిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కేసీఆర్ మార్చుకుంటే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సింగరేణిని ప్రైవే ట్ లిమిటెడ్‌గా మార్చుకుందని విమర్శించారు.

భక్తుల సౌకర్యం కోసం హైదరాబా ద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ మూడో ఫేజ్‌ను విస్తరించబోతున్నా మని, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అన్నట్లుగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ దీర్ఘకాలిక అభివృద్ధి బడ్జెట్ అన్నారు. పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ ఉన్న కమ్యూనిస్టులు నరేంద్ర మోదీని గద్దె దించుతారా?, వారి పార్టీలు కనుమరుగు కాకుండా ముందు చూసుకోవాలని సూచించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బడ్జెట్ కేటాయింపులపై కిషన్‌రెడ్డి మాట్లాడారు. 

గనుల కేటాయింపులో టెండర్లు వేసే ముందు సైట్ విజిట్ చేయాలనేది దేశవ్యాప్తంగా ఉన్న రూల్ అని, ఇది ప్రజలకు మేలు చేస్తుందన్నారు. కానీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, 17 కంపెనీలు విజిట్ చేస్తే ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదని విమర్శించారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టుకుంటు న్నారని విమర్శించారు.

గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేవాటినే చేస్తూ పాలన సాగిస్తుం దన్నారు. ఈసారి తీసుకొచ్చిన బడ్జెట్ అన్నివర్గాలకు మేలు జరిగేలా ఉందని, బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బడ్జెట్ ప్రవేశపెడతారనే ప్రజల ఆలోచనకు, భావనకు భిన్నంగా ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. 

2047 నాటికి వికసిత భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంలో ఈ బడ్జెట్ మరొక ముంద డుగన్నారు. దేశంలో సుస్థిరమైన అభివృద్ధి కావాలనే ఆకాంక్షలకు రెక్కలు తొడిగే బడ్జెట్ ఇదన్నారు. రాష్ట్రాల వారీగా కాకుండా, దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నామని.. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు సరిపడా నిధులను కేటాయించామని, వారికి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులు అందుతాయని చెప్పారు. 

హబ్స్ ఆఫ్ హబ్ హైదరాబాద్..

ఐటీ హబ్.. ఎడ్యుకేషనల్ హబ్.. డిజిటల్ హబ్.. హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్.. సెమీ కండక్టర్ హబ్.. డేటా సెంటర్ హబ్.. మెడికల్ హబ్.. ఇలా హైదరాబాద్.. ‘హబ్స్  ఆఫ్  హబ్ హైదరాబాద్’గా.. అవతరించిందని కిషన్‌రెడ్డి అన్నారు. ఎంఎస్ ఎంఈలకు దేశవ్యాప్తంగా ప్రోత్సాహకాలు కల్పించామని, తెలంగాణలో ఉన్న 23 లక్షల ఎంఎస్‌ఎంఈలకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ బడ్జెట్లో వచ్చే ఐదేళ్ల కోసం రూ. 10వేల కోట్లతో ప్రకటించిన బయోఫార్మా (స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్) కార్యక్రమం ద్వారా ఫార్మా కేపిటల్‌గా ఉన్న మన హైదరాబాద్ నగరానికి చాలా మేలు జరగనుందన్నారు.

ఈ పథకం కింద దేశంలో 3 కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ సంస్థలను ఏర్పాటు చేయనున్నారని,  క్లినికల్ ట్రయల్స్ రంగంలో కూడా ఎన్‌ఐపీఆర్ ద్వారా పరిశోధనలు పెరుగుతాయన్నారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా.. మన రెగ్యులేటరీ ఇన్ఫ్రా సదుపాయాలు పెరుగుతాయని, ‘గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషించేందుకు వీలుకలుగుతుందన్నారు. 

96 వేల కోట్లు పెరిగాయి..

వీబీబీ రామ్‌జీపై కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేసిందని, ఇందుకు భిన్నంగా 2025--26లో రూ. 88వేల కోట్లు ఉన్న ఉపాధి హామీ పథకం బడ్జెట్.. 2026--27 సంవత్సరానికి రూ. 96 వేల కోట్లకు పెరిగిందని, అంటే నిధుల్లో 9 శాతం వృద్ధి కనబడుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితులతో సంబంధం లేకుండా ఎరువులను రైతులకు భారీ సబ్సిడీ అందజేస్తున్నామన్నారు.

టెక్స్-ఇకో కార్యక్రమం ద్వారా.. టెక్సై్టల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీకి తగ్గట్లుగా భారతీయ వస్త్రపరిశ్రమ ఎదిగేందుకు కేంద్రం సహకరించనుందని, ఇప్పటికే తెలంగాణకు ప్రకటించిన ‘కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్’కు ఈ పథకం ద్వారా మరింత లబ్ధి చేకూరనుందన్నారు. ఎస్‌ఏఎస్‌సీఐ పథకం కింద ఇప్పటివరకు రూ. 9,502 కోట్లను కేంద్రం ఇచ్చిందని, దీంట్లో భాగంగా ఇటీవల రామప్ప దేవాలయం అభివృద్ధికి రూ.73.74 కోట్లు, సోమశిల వెల్నెస్ సెంటర్ కోసం రూ. 68.10 కోట్లు కేటాయించిందన్నారు.

ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా తెలంగాణలోని 33 జిల్లాలకు ఒక్కో గర్ల్స్ హాస్టల్ రానుందన్నారు. త్వరలోనే.. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా హైదరాబాద్ అభివృమరిన్ని నిధులు ఇవ్వనుందన్నా రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద తెలంగాణకు 1.3 లక్షల ఇళ్లకు ఇంటికి రూ. లక్షన్నర చొప్పున రూ.2,190 కోట్లు కేటాయించనుందన్నారు.

ప్రధానమంత్రి అవాస్ యోజన-రూరల్ లో భాగంగా తెలంగాణకు ఇంటికి.. రూ. 72 వేల చొప్పున 3 లక్షల ఇళ్ల కోసం రూ. 2,160 కోట్లు కేటాయించనుందన్నారు. హైదరాబాద్‌లో అటామిక్ మినరల్స్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు రూ. 406 కోట్లు, ఏఆర్‌సీఐ, సీడీఎఫ్‌డీ లాంటి కేంద్ర సంస్థలకు సుమారు రూ. 3 వేల కోట్లు కేటాయించారని వివరించారు. 

జాతీయ రహదారుల నిర్మాణం..

టర్నోవర్ ఆధారంగా ఐటీ కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్ వివాదాలు, వారి సమస్యల పరిష్కారం తదితర అంశాలకు సంబంధించిన విషయాల్లో పూర్తి మినహాయింపు నిచ్చిందని, డేటా సెంటర్లలో పెట్టు బడులను ప్రోత్సహించేందుకు కేంద్రం నడుంబిగించిందన్నారు. తెలంగాణలో దాదాపు 5 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేశామని, రూ. 2,484 కోట్ల అంచనా వ్యయంతో 59 కిలోమీటర్ల మేర జగిత్యాల--కరీంనగర్ జాతీయ రహదారి, రూ. 2,730 కోట్ల ఖర్చుతో 68 కిలోమీటర్ల పొడవున 4 లేన్లతో ఆర్మూరు-జగిత్యాల- ర్యాల జాతీయ రహదారి నిర్మాణం జరగనుందని, రూ. 3,175 కోట్ల వ్యయంతో మహబూబ్‌నగర్-గూడెబళ్లూరు మధ్య 80 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ చేపట్టనున్నారని తెలిపారు. 231 కిలోమీటర్ల మేర ఆరు లేన్లతో హైదరాబాద్- మధ్య రూ.10,297 కోట్లతో రహదారి నిర్మించనున్నారని, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగం)కు రూ.21,629 కోట్లను కేంద్రం కేటాయించిందని, మొత్తం తెలంగాణలో రూ.42 వేల కోట్ల నిధులతో కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. 

సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. 

రైల్వేకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా హైదరాబాద్ కు ప్రాజెక్టులకను కేంద్రం కేటాయించిందని, 2009--2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల కోసం అప్పటి ప్రభుత్వం రూ. 886 కోట్లు కేటాయిస్తే.. తాజా బడ్జెట్‌లో ఏకంగా 6 రెట్లు అధికంగా రూ. 5,454 కోట్లు కేటాయించిందన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో రూ. 47,984  కోట్ల విలువైన రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు.

అమృత్ భారత్ పథకం ద్వారా 42 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారని, వాటిలో ఇప్పటికే 5 స్టేషన్లు పూర్తి అయ్యాయన్నారు. అందులో బేగంపేట, కరీంనగర్, వరంగల్, చర్లపల్లి స్టేషన్ల ఆధునీకరణ పూర్తయిందని, త్వరలోనే కొమురవెల్లి మల్లన్న, జోగులాంబ రైల్వే స్టేషన్లు  కూడా పూర్తికానున్నాయని తెలిపారు. 2026లో 30 కి పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని, తెలంగాణకు ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లు, 2 అమృత్ భారత్ రైళ్లు కేటాయించారని పేర్కొన్నారు.

2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 900 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం పూర్తయిందని, 2014 నుంచి ఇప్పటివరకు 1,115 కిలోమీటర్ల మేర రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయని, దీంతో తెలంగాణలోని రైల్వే ట్రాక్లకు 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ సాధ్యమైందన్నారు. తెలంగాణలో మొత్తం 1,242 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లలో కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు మంజూరు కాగా, ఇప్పటి వరకు 627 కిలోమీటర్ల మేర  పూర్తి అయిందన్నారు.

410 కిలోమీటర్ల మేర పనులు త్వరలోనే పూర్తికానున్నాయని, కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సికింద్రాబాద్ ఏర్పాటు అవుతోందన్నారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు మన హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభం అవుతున్నాయని, అవి హైదరాబాద్- హైదరాబాద్- హైదరాబాద్- అన్నారు. ఈ కారిడార్లతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు.. ఇందుకోసం రూ. లక్షా 51వేల కోట్లను కేంద్రం ఖర్చుచేయనుందని, హైదరాబాద్ నుంచి చెన్నై వరకు కేవలం 2 గంటల 55 నిమిషాల్లో చేరుకోవచ్చు...ఇందుకోసం రూ. లక్షా 90వేల కోట్లను కేంద్రం ఖర్చుచేయనుందన్నారు.

అలాగే హైదరాబాద్ నుంచి పుణే వరకు కేవలం గంటా 55 నిమిషాల్లో చేరుకోవచ్చు.. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడుకు తెలంగాణకు కనెక్టివిటీ మరింతగా పెరుగుతుందన్నారు.  ఎంఎంటీఎస్ రెండో దశ నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా తాము పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు బడ్జెట్‌లో పెద్ద పీట వేసినందుకు ప్రధానమంత్రికి, రైల్వే, జాతీయ రహదారుల మంత్రి, ఆర్థిక మంత్రులకు తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పారు.

ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేస్తాం.. 

ఎయిర్ పోర్టులకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించరని, ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. మేడారానికి 3 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, వాటిని తీసుకొచ్చే బాధ్యత తనదని, అయితే వాటిని పంచుకోకుండా ఖర్చు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. గతంలో 20 లక్షలు కూడా కేటాయించేవారు కాదన్నారు.