ఉపాధి కోల్పోయిన నిరుపేదలు!
- పట్టించుకోని అధికార పక్షం..
- నోరు మెదపని ప్రతిపక్షం..
కేసముద్రం, జూన్ 25 (విజయక్రాంతి): ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డు విస్తరణ పేరుతో ఏళ్ల తరబడి మార్కెట్ రోడ్డు, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద, ప్రధాన రహదారుల వెంట ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు, చేతివృత్తిదారుల షాపులను తొలగించడంతో సుమారు 100 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎన్నో ఏళ్లుగా మటన్, చికెన్, కూరగాయలు, సైకిల్ షాపులు, టైర్ పంచర్ షాపులు, టైలరింగ్ పనులు, మెకానిక్, ఎలక్ట్రికల్ వైండింగ్ షాపులు, పాన్ షాపులు, సెలూన్ షాపులు, ఇస్త్రీ షాపులు, ఇతర చిన్నచితక చిరు వ్యాపారులకు చెందిన గుంచీలు, తాత్కాలిక షెడ్లను ఉన్నఫలంగా తొలగించారు. దీనితో 100 కుటుంబాలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
చేతివృత్తులపై ఆధారపడ్డ నిరు పేదలకు ప్రత్యామ్నయం చూపకపోవడంతో పాటు కేసముద్రం పట్టణంలో ప్రధాన వీధులన్నీ విస్తరిస్తుండడంతో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు ప్రత్యామ్నాయంగా మరోచోట ఉపాధి అవకాశాలు చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధాన రహదారులను 80 అ డుగుల నుండి 100 అడుగులకు పైగా విస్తరిస్తుండడంతో ఎక్కడ కూడా వారికి ఉపాధి పొందే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు.
ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కు ఇరువైపులా, కిష్టయ్య సేటు మిల్లు వద్ద, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద, ఉప్పరపల్లి రోడ్డు లోని స్కూలు వద్ద, పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద అనేకమంది నిరుపేదలు రోడ్ల వెంట గుమ్చీలు, తాత్కాలిక షెడ్లు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వారందరికీ ప్రత్యామ్నయం చూపకుండా రోడ్డు విస్తరణ కోసం వారి గుంచీలను, తాత్కాలిక షెడ్లను, తోపుడు బండ్లను తొలగించిన ఘటనపై అటు అధికార పక్షం పట్టించుకోవడంలేదని, ఇటు పేదల పక్షాన నిలబడి పోరాడాల్సిన వామపక్ష పార్టీలతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నాయకులు నోరు మెద పడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో మీకు ఎలాం టి కష్టం వచ్చినా.. మీ కాలిలో ముళ్ళు గు చ్చుకుంటే మా నోటితో తీస్తామంటూ తెగ హామీలు ఇచ్చి.. ఓట్ల తర్వాత.. మా గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడని నిర్వాసితులైన చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అధికారులు కనీసం తమ పట్ల జాలి, కరుణ చూపకుండా నిర్ధాక్షిణ్యంగా ఉన్నఫలంగా తమ ఉపాధి అవకాశాలను కూల్చి వేశారని వాపోతున్నారు. అభివృద్ధి చేయడం వరకు ఓకే.. కనీసం పేదల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా.. ప్రత్యామ్నాయ అవకాశాలు చూపడం వారి బాధ్యత కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేసముద్రం పట్టణంలో 100 కుటుంబాలను వీధిన పడేసిన ఘటనపై ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేదలంటే ఇంత అలుసా అంటూ ఆయా పార్టీల నేతల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారి పట్ల అధికారులు కర్కశంగా వ్యవహరించడం సమంజసం కాదని, వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన మున్సిపల్ అధికారులు కనీస బాధ్యతగా భావించడం లేదని, తమను అసలు మనుషుల్లాగానే చూడకుండా షాపుల్లోని సామాన్లు తీసుకోకుండా కూల్చివేతకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు.
పట్టణంలో పేదలు ఉండకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పట్టణమంతా రోడ్ల విస్తరణ కోసం అనేక చోట్ల ధనికుల షాపులు, ఇండ్లను తొలగించకుండా చూచిచూడనట్లు వదిలేస్తూ, తమను మాత్రం అప్పటికప్పుడు ఖాళీ చేయించారని, కొందరు సామాన్లు తీస్తుండగానే ఆగకుండా కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. ఇంతకాలం ఆ షాపులను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న తమకు ప్రస్తుతం భవిష్యత్తు శూన్యంగా మారిందని, కుటుంబాలను పోషించడం కష్టతరంగా మారిందని, వెంటనే ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్షాల నేతలు స్పందించి తమకు ప్రత్యామ్నాయ అవకాశాలు చూపాలని కోరుతున్నారు.
మళ్లీ ఊరే దిక్కయింది.!
ఈ ఫోటోలో కనిపిస్తున్న సెలూన్ షాపు చక్కగా ఉందేమిటి అనుకుంటున్నారా.. ఈ షాపు యజమాని లింగాల సుదర్శన్ ది స్వగ్రామం కేసముద్రం మండలం కలవల. ఇతని తాత నరస య్య, తండ్రి చంద్రయ్య నుంచి మొదలుకొని ఇతని వరకు కేసముద్రంలోని వ్యవసాయ మా ర్కెట్ గేటుకు ఇవతలి వైపు ఉన్న ప్రభుత్వ స్థలంలో 50 ఏళ్లకు పైగా సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. షాపు నిర్వహించుకోవడానికి జీపీకి ఏళ్ల తరబడి పన్ను చెల్లిస్తూ వచ్చా రు.
ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి రోడ్డు విస్తరణ పేరుతో ఆ సెలూన్‌ను అధికారులు పడగొట్టారు. దీంతో అతనికి ప్రత్యామ్నాయం లభించక చివరికి తప్పని పరిస్థితుల్లో మళ్లీ తన సొంత ఊరు కలువలకు వెళ్లి షాపు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి చాలా మందికి ఏర్పడింది. అనేక ఏళ్లుగా కేసముద్రం పట్టణాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న చేతివృత్తుల వారంతా ప్రస్తుతం వారి షాపులు తొలగించడంతో కొందరు స్వగ్రామాలకు వెళుతుండగా, మరికొందరు ఇతర గ్రామాలకు వలస వెళుతున్నారు. అభివృద్ధి పేరుతో ఉపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






