04-02-2026 02:26:43 AM
హలో నిరుద్యోగి.. ఛలో ఇందిరాపార్క్
‘నిరుద్యోగుల కవాతు’కు అనుమతినివ్వని పోలీసులు
యువత పోరుబాట
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): నిరుద్యోగులు ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరు ద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఉద్యోగ నోటిఫి కేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హలో నిరుద్యోగి.. ఛలో ఇందిరాపార్క్ నినాదంతో నిరుద్యోగ యువత పోరుబాటకు సిద్ధమైం ది. ఇందిరాపార్క్ వేదికగా నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో బుధవారం మహాధర్నా కార్యక్రమాన్ని యువత చేపడుతోంది. ఈ మహాధర్నాకు భారీ స్థాయిలో నిరుద్యో గ యువత హాజరుకానున్నట్లు నిరుద్యోగ జేఏసీ నాయకులు చెప్తున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలానా..?
కాంగ్రెస్ నాయకులు, మంత్రులపై నిరుద్యోగ యువత ఆగ్రహంతో ఉన్నా రు. ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టో లు, ప్రచార వేదికల్లో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటూ చెప్పిన నేతలు ఇప్పుడు మాట మార్చడం అన్యాయమంటున్నారు. ఎన్నికలున్నాయని అప్పుడు హామీలిచ్చి...అధికారంలోకి రాగానే ఇప్పుడు తాము రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించలేదని ఏకంగా చట్టసభల్లోనే చెప్పడం దారుణమంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందని ప్రశ్నిస్తున్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని నిరుద్యోగ యువత మండిపడుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వానివన్నీ అబద్ధపు ప్రచారాలనేనని నిరుద్యోగ యువత విమర్శిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పది వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని సుమారు ఆరు వేల వరకే ఉన్నాయని ఓ నిరుద్యోగ జేఏసీ నాయకుడు తెలిపారు.
అయినా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను వీరి ఖాతాల్లో వేసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 2024 డీఎస్సీలో దాదాపు 5 వేల పోస్టులను అదనంగా జోడించారని, గ్రూప్ మరో 60 వరకు పోస్టులను జోడించి నోటిఫికేషన్లు ఇచ్చి 70 వేల ఉద్యోగాలు, 80 వేల ఉద్యోగాలను భర్తీ చేశామంటూ చెప్పుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రాజకీయ నేతలకు ఆహ్వానంలేదు
ఎన్నికల్లో తమను వాడుకొని, తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పడు తమను విస్మరించిందని నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. అందుకే ఈ మహాధర్నాకు ఏ రాజకీయ నాయకుడిని ఆహ్వానించలేదని, మద్దతు తెలిపేందుకు వచ్చినా తాము స్టేజీ మీదకు రాణీయమని, ఎవ్వరూ రావొద్దని హెచ్చిరిస్తున్నారు. మరోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగాలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ రాజకీయాల కోసం తమను వాడుకోకుండా, ప్రభుత్వానికి, ప్రజలకు తమగోడును వినిపించేలా మహాధర్నాను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు, జాగ్రత్తలను నిరుద్యోగ జేఏసీ నేతలు తీసుకుంటున్నారు. కేవలం నిరుద్యోగులనే ఈ మహాధర్నాకు ఆహ్వానిస్తున్నారు.
కవాతుకు అనుమతి నిరాకరణ
నిరుద్యోగ కవాతుకు పోలీసులు అనుమతినివ్వలేదని జేఏసీ నేతలు చెప్పారు. తొలుత ఈ మహాధర్నాను గత నెల చివరి వారంలో నిర్వహించేందుకు అనుమతినివ్వాలని పోలీసు అధికారులకు జేఏసీ నేతలు దరఖాస్తు చేసుకుంటే జనవరి 26, శాంతిభద్రతల దృష్ట్యా వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు.
ఈక్రమంలోనే చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇందిరాపార్క్ వరకు నిరుద్యోగ ర్యాలీతోపాటు మహాధర్నాకు ఈనెల ఫిబ్రవరి 4న నిర్వహించేందుకు అనుమతినివ్వాలని దరఖాస్తు చేసుకున్నట్లు ఓ జేఏసీ నేత తెలిపారు. అయితే కవాతుకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదని, మహాధర్నాకు మాత్రమే ఇచ్చారని తెలిపారు. దీంతో మహాధర్నాను విజయవంతం చేయాలని నిరుద్యోగ యువత పిలుపునిచ్చింది.
నిరుద్యోగు జేఏసీ డిమాండ్లు ఇవే..
* రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాలి
* 35 వేల ఖాళీలతో మెగా డీఎస్సీ వేయాలి
* ఏపీ తరహాలో వెనువెంటనే డీఎస్సీ నోటిఫికేషన్లు వేయాలి
* బీఈడీ వాళ్లకు ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పించాలి
* జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలి
* ఎస్‌ఐ, కానిస్టేబుల్, గురుకులాలు, అగ్రికల్చర్, ఫారెస్ట్, వైద్యారోగ్యశాఖతోపాటు ఇతర శాఖల్లోని ఖాళీను వెంటనే భర్తీ చేయాలి
* నిరుద్యోగ భృతి అమలు చేయాలి