బండి స్కీంలో తొండి!
ఒకప్పుడు డ్రైవర్ కమ్ ఓనర్ !
ఇప్పుడు ఓనర్ కమ్ ఆఫీసర్ !
జీడబ్ల్యూఎంసీలో గుట్టుగా వ్యవహారం
బినామీ పేర్లతో అధికారుల వాహనాలకే బిల్లులు
గ్రేటర్‌లో 400 నుంచి 150కి తగ్గిన లబ్ధిదారులు
ప్యాకేజీ సరిపోక లబ్ధిదారుల సతమతం
దళితబంధు తరహాలో కొత్త వాహనాలకు డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండేందుకు ప్రవేశపెట్టిన డ్రైవర్ కమ్ ఓనర్(డీసీఓ) స్కీంలో అధికారులు చొరబడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పదేళ్ల క్రితం నాటి కమిషనర్ సోమేశ్‌కుమార్ వినూత్నంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 400కు పైగా కార్లను జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల అధికారులకు కేటాయించారు. డ్రైవర్లకే వాహనాలు మంజూరు చేసి వాటికి ప్రతినెలా చెల్లించే అద్దెను ఈఎంఐగా చెల్లించింది. రుణం తీరాక ఆ వాహనాలకు డ్రైవర్లకు చెందేలా పథకం రచించారు. అయితే, ఆఫీసర్లు ఈ పథకంలో తొండికి తెగబడ్డారు. తమ సొంత వాహనాలను అద్దెకు పెట్టి ఈ స్కీంను ఆఫీసర్ కమ్ ఓనర్‌గా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 400 మంది డ్రైవర్ కమ్ ఓనర్లలో ఇప్పుడు 150 మంది మాత్రమే మిగిలారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ప్రారంభమైన తర్వాత జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, వివిధ విభాగాల అధికారులకు ఈ వాహనాలను కేటా యించారు. ఈ పథకం ప్రారంభమైన 2014 లో డీజీల్ ధరలు కేవలం రూ. 48 మాత్రమే ఉండేది. దీంతో ఆ సమయానికి వీరికిచ్చే ప్యాకేజీని రూ. 25 వేలకు ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అలాగే, డీజీల్ ధరలు పెరిగినప్పుడల్లా ప్యాకేజీలో 10 శాతం పెంచాలనే నిబం ధనను అధికారులు జీవో రూపంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత పెరుగుతున్న డీజీల్ ధరలు, ఇతర ఖర్చుల నేపథ్యంలో రూ.25 వేల నుంచి రూ.34 వేలకు పెరిగింది.
బినామీ పేర్లతో బిల్లులు
డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కొన్నేళ్లు బాగా నే నడిచింది. ఆ తర్వాత అధికారులే వారి సొంత వాహనాలను తెచ్చుకొని డిసిఓ (డ్రైవర్ కమ్ ఓనర్) పేరుతో బిల్లులు పొందుతున్నట్టుగా విమర్శలు ఉన్నాయి. వీరికిచ్చే ప్యాకేజీలో బినామీ బిల్లు ఇచ్చిన సదరు ట్రావెల్స్‌కు రూ. 4 వేలను అధికారులు చెల్లించి, మిగతా రూ. 30 వేలను తమ ఖాతాలో వేసుకుంటున్నట్టు బల్దియాలోనే చెవులు కొరుక్కుంటున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాయాలతో పాటు ఇతర ముఖ్యమైన అధికారులు దాదాపు 200 మంది బినామీ పేర్లతో ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్యాకేజీ పెంపుపై డీసీవోల డిమాండ్
సాధారణంగా ప్రభుత్వ అధికారులు వాడే ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటూ స్టిక్కర్ అంటిస్తారు. దీంతో వాహనాలను తనిఖీ చేసే రవాణా శాఖ, పోలీసులు సైతం ఆ వాహనాలను సాధారణంగానే వదిలేస్తుంటారు. కానీ, డీసీఓ వాహనాలను మాత్రం రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేసే సమయంలో అన్ని రకాల పత్రాలను చూపిం చాల్సి వస్తుంది. దీంతో వీరు ప్రతివాహనానికి ఉండాల్సిన పత్రాల కోసం వీరికిచ్చే ప్యా కేజీలోనే సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. దీంతో రూ. 34 వేల ప్యాకేజీ ఏమాత్రం సరిపోవడం లేదంటూ డీసీఓల వాదన. 7 ఏళ్ల క్రితం ఫిక్స్ చేసిన రూ. 34 వేల ప్యాకేజీని పెరిగిన ఇంధనం, మెయింటనెన్స్ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని రూ. 45 వేల నుంచి రూ. 55 వేలకు పెంచాలని కోరుతున్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ పద్ధతిలో బినామీ బిల్లులు పొందుతున్న అధికారులపై ప్రభు త్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దళితబంధు తరహాలో..
రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే వయస్సు రీత్యా ఇతర ఉద్యోగాలకు అర్హత లేకపోవడం, దాదాపు 10 ఏళ్లుగా జీహెచ్‌ఎంసీలోనే సేవలు అందిస్తున్న కారణంగా ఈ పథకాన్ని కొనసాగించాలి. వాహనాలు వయస్సు 10 ఏళ్లు కావడం చేత దళిత బంధు తరహాలో డిసిఓలు అందరికీ ప్రభుత్వమే కొత్త వాహనాలు కొనుగోలు చేసి ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్స్ కమ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి. రాజేందర్ రావు, ప్రధాన కార్యదర్శి జి. దేవేందర్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






