మరమ్మతులకు నోచుకొని రోడ్డు- ప్రమాదాలకు నెలవు
బెజ్జంకి, ఆగస్టు 20: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రం నుంచి చిలాపూర్ వెళ్లే ప్రధాన రహదారి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో అధ్వానంగా మారింది. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల కోసం కొన్ని నెలల క్రితం రోడ్డును తవ్విన అధికారులు.. పనులు పూర్తయినా మరమ్మతులు చేపట్టకుండా మట్టికుప్పలు, కంకరను అలాగే వదిలేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తవ్విన ప్రాంతంలో గుంతలు, కంకరతో రోడ్డు ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డును పునరుద్ధరించి, ప్రమాదాల నివారణకు హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని చిలాపూర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






