రాష్ట్రంలో 98 వేల కోట్లతో రహదారులు
- 148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం.. 300 గ్రామాల్లో సమస్యకు పరిష్కారం
- 2028 కల్లా తెలంగాణలో.. దేశంలోనే అత్యుత్తమ రోడ్ల నిర్మాణం లక్ష్యం
- నవంబర్‌లో హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ‘ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా రాష్ట్రంలో రూ. 98,000 కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులను చేపడుతున్నాం. 148 కోట్లతో అప్రోచ్ రోడ్లను నిర్మించనున్నాం. ఇది 300 గ్రామాల్లో సమస్యలకు పరిష్కారం కానుంది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
2028 చివరి నాటికి రోడ్ల నిర్మా ణంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టినట్టు మంత్రులు తెలిపారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఇండి యన్ రోడ్ కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించేం దుకు అవసరమైన నిధులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశం అనంతరం రాష్ట్రానికి 20 వేల కోట్లకు పైగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రూ.148 కోట్లతో నిర్మించనున్న అప్రోచ్ రహదారులతో 300 గ్రామాల్లో నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనుందని తెలిపారు. గత ప్రభుత్వం సమావేశాలు పెట్టి వదిలివేయడం తప్ప అప్రోచ్ రోడ్ల పూర్తికి నిధులు మంజూరు చేయలేదని మంత్రి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 13 వేల కోట్లతో 6,000 కి.మీ రహదారులను హ్యామ్ మోడల్‌లో చేపడుతున్నట్టు మంత్రి వెంకట్‌రెడ్డి వివరించారు. ఈ పనులకు సంబంధించిన ప్రైస్ బిడ్ పనులు పూర్తి అయ్యాయి.
మే మొదటి వారంలో రాష్ట్రంలో హ్యామ్ మోడల్‌లో రోడ్ల నిర్మాణం చేపట్టుతున్నట్టు వివరించారు. 20 వేల కోట్లతో హైదరాబాద్--విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మొత్తం 8 లైన్లతో ఈ రహదారి విస్తరణ మందు చేపట్టినట్టు తెలిపారు. ఆరు ప్రధాన లైన్లు, రెండు సర్వీస్ లైన్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రూ.500 కోట్లతో బ్లాక్ స్పాట్స్, చౌటుప్పల్, చిట్యాల వంటి గ్రామాల మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందని వివరించారు.
గడ్కరీని ఒప్పించా: మంత్రి కోమట్‌రెడ్డి
దేశంతోపాటు, ప్రపంచం నలుమూలల నుంచి రోడ్డు కాంట్రాక్టర్లు, బిల్డర్లు హాజరయ్యే ప్రతిష్టాత్మక ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సమావేశం 2026 నవంబర్‌లో హైదరాబాదులోని హైటెక్స్‌లో నిర్వహించనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎంపీగా, కేంద్రమంత్రి గడ్కరీతో తనకున్న పరిచయం మూలంగా హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించేందుకు ఒప్పించానని వివరించారు.
ఈ సమావేశం నిర్వహణకు బీజేపీ పాలనలోని రాష్ట్రాలు పోటీపడినప్పటికీ కేంద్ర మంత్రి గడ్కరీ తన విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేందుకు అనుమతించినట్లు తెలిపారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రానికి చెందిన మోహన్‌నాయక్ ఎన్నికైన విషయాన్ని సైతం మంత్రి కోమటిరెడ్డి గుర్తుచేశారు.
148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం
రాష్ట్రంలో మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరూపయోగంగా ఉన్నాయని, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన రూ.148 కోట్ల నిధుల విడుదలకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం ప్రకటించారు.
సరైన పద్ధతిలో ప్రతిపాదనలు పంపితే ఆమోదం తెలపడం, అమలు చేయడం సులభం అవుతుందని పనులు వేగవంతం అవుతాయని డిప్యూటీ సీఎం తెలిపారు. 1:4 నిష్పత్తిలో వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపితే సబ్ కమిటీలు చర్చించి ఆమోదం తెలుపుతామని అధికారులకు సూచించారు.
రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని జూన్ 8 లోపల అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే..
ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి- బందరు పోర్టు వరకు 20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్ రోడ్ నిర్మాణానికి అలైన్మెంట్ ఖరారుచేసి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు మంత్రి వెంకటరెడ్డి అధికారులకు వివరించారు. ఈ రోడ్డు అలైన్మెంట్‌కు అనుగుణంగా బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అవసరమైన అలైన్మెంట్ సైతం ఖరారు చేసి పంపించామన్నారు. మన్ననూరు- నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ రహదారి నిర్మాణానికి 8,000 కోట్లు కేటాయిం చినట్టు పేర్కొన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.36 వేల కోట్లు మంజూరు అయ్యాయని, ఇది రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ ప్రాజెక్టు అని వెల్లడించారు. ఈనెల 8న రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరభాగం భూ సేకరణకు రాష్ట్ర వాటాగా రూ.628 కోట్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు జమచేశామని తెలిపారు. ఎల్బీనగర్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను రూ. 941 కోట్లతో చేపడుతున్నామని వివరించారు. ఇందు లో కేంద్రం వాటా రూ. 741 కోట్లు కాగా రాష్ట్రం 200 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు.
రహదారులు లేని గ్రామాల్లో కొత్త రోడ్లు, సింగిల్ రోడ్ల స్థానంలో డబుల్ రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. రహదారుల నిర్మాణంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివ స్తాయని, తద్వారా స్థానిక యువతకు పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణానికి, హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సమావేశం నిర్వహించేందుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
రోడ్డు ప్రమాదాలతో రాష్ట్రంలో 2025 సంవత్సరంలో 6,500 మంది దురదృష్టవశాత్తు ప్రా ణాలు కోల్పోతున్నారని, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం, అరైవ్ వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు మంత్రి వెంకటరెడ్డి తెలిపారు.






