రణగర్జన
రగులుతున్న పశ్చిమాసియా
- గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఉధృతం
- టెహ్రాన్‌లోని బంకర్లు ధ్వంసం.. 50 ఫైటర్ జెట్లతో దాడి
- ఇరాన్ డ్రోన్ వాహక నౌకను ధ్వంసం చేసిన అమెరికా
పశ్చిమాసియా గగనతలం క్షిపణులు, డ్రోన్ల గర్జనలతో దద్దరిల్లుతున్నది. ఈ భీకర పోరు శుక్రవారం ఏడో రోజుకు చేరుకుంది. ఇరాన్ తన డ్రోన్లు, క్షిపణులతో బహ్రెయిన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసు కుంది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న బంకర్లపై బాంబుల వర్షం కురిపించాయి. అమెరికా తన బీ స్టెల్త్ బాంబర్లతో ఇరాన్ అణు, క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసింది.
సముద్ర జలాల గుండా వెళ్తున్న ఇరాన్ డ్రోన్ వాహక నౌకపై దాడి చేసింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగా ఆ దేశ రాజధాని బీరుట్ నెత్తురోడుతున్నది. తాజా దాడుల్లో ఐదుగురు లెబనాన్ పౌరులు మృతిచెందారు. మరికొంత మంది క్షతగాత్రులయ్యారు. తమ షరతులు ఒప్పుకుంటేనే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటామని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ తెగేసి చెప్పారు. మొత్తంగా ఈ యుద్ధంలో అన్ని దేశాలు కలిపి ౧,౪౫౯ మంది ప్రజలు మృత్యువాతపడటం ఆందోళన కలిగించే విషయం.




