శృంగారం రిలేషన్‌లో భాగమే!
తాజాగా నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓరోన్ మే కహాన్’. ఇందులో కథానాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తుండగా, ఆయనతో సీనియర్ హీరోయిన్ టబు జత కట్టునుంది. ఈ చిత్రాన్ని నరేంద్ర హీరావత్, కుమార్ మంగత్ పాఠక్, సంగీత అహిర్, శీతల్ భాటియా నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీత సారథ్యం వహిస్తున్నారు. జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ వేడుక నిర్వహించగా, టబు.. ప్రేమ, శృంగారం, మానవ సంబంధాల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ‘శృంగారం అనేది యువకులు, ఒక నిర్ధిష్ట వయసు వారు మాత్రమే చేసేది కాదు.. మీరు రొమాన్స్, లవ్, రిలేషన్‌షిప్ గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి అడ్డంకులూ ఉండవని నేను భావిస్తాను.
రిలేషన్స్‌కు అంతం ఉండదు. ప్రేమ, శృంగారం మానవ సంబంధాలలో భాగం. నిజానికి మానవ సంబంధాలే సినిమాలకు అవసరమైన ఆలోచనల్ని, కథల్ని ఇస్తున్నాయి’ అని చెప్పుకొచ్చిందీ భామ. ఇంకా ఈ ‘ఓరోన్ మే కహాన్’ సినిమాలోనూ ప్రేమ, శృంగారం కంటే రిలేషన్‌షిప్ గురించి ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అని తెలిపింది. అజయ్ దేవగన్‌కు టుబు కాలేజీ రోజుల్లో నుంచే మంచి స్నేహితురాలు. అలా రియల్ లైఫ్ నుంచే కాదు రీల్ లైఫ్‌లోనూ తాము క్లోజ్ ఫ్రెండ్స్ అని నిరూపించేలా ఎన్నో సినిమాల్లో కలిసి నటిస్తూ వస్తోందీ జంట. తాజాగా ఇలా ‘ఓరోన్ మే కహాన్’ సినిమాతోనూ తెర పంచుకునే అవకాశం ఈ జంటకు దక్కింది. ఇదిలా ఉండగా, యాభై రెండేండ్ల వయస్కురాలైన టబు టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో శృంగార పాఠాలు వల్లె వేయడం ఆసక్తికరంగా మారింది.






