శివుడి ఆజ్ఞతోనే కన్నప్ప తీశాం
హీరో మంచు విష్ణు ముఖ్య పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకుడు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. “కన్నప్ప’ ఏ తరానికైనా కొత్తగానే ఉంటుంది. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలూ ఉంటాయి. భారతదేశంలోని నలుమూలల నుంచి మహా నటుల్ని ఈ చిత్రంలో భాగస్వామ్యం చేశాం. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం” అని చెప్పారు.
“విష్ణు ‘కన్నప్ప’ను సినీ ప్రియులందరూ భుజానికెత్తుకొని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి వస్తున్న ప్రోత్సాహాన్ని చూస్తున్నాం. అందుకే వాళ్లలో నుంచి కొందరినీ ఈ ఈవెంట్‌కు ఆహ్వానించాం” అని విష్ణు తెలిపారు. ఈ సినిమా గురించి విష్ణు ఇంకా చెప్తూ.. “కన్నప్ప’ మైథాలజీ కాదు. మన చరిత్ర. కల్పిత కథ అంటే నమ్మొద్దు. రెండో శతాబ్దంలో చోళ రాజుల కాలంలో జరిగిన కథ ఇది. ఏడో శతాబ్దంలో ‘కన్నప్ప’ గురించి శంకరాచ్యుడు చెప్పారు. 14వ శతాబ్దంలో నాయనార్ల గురించి ధూర్జటి రాశారు.
అందులో 9వ నాయనార్ కన్నప్పనే. ‘కన్నప్ప’ గురించి 18 శతాబ్దంలోనూ బ్రిటీష్ వారు ఇంగ్లిష్‌లో ప్రింట్ చేశారు. బికనీర్ యూనివర్సిటీలో ఆ పుస్తకం చదివి ఎంతో జాగ్రత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ‘కన్నప్ప’ నా బిడ్డ లాంటిది. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు ముఖేశ్, శరత్ కుమార్, మధుబాల, ప్రీతి ముకుందన్ తదితరులు ఈ సినిమా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.






