16 July, 2026 | 1:44 PM

ఆ సినిమాపై హైకోర్టు నిషేధం

15-06-2024 12:19 AM

‘షాదీ కే డైరెక్టర్ కరణ్ ఔర్ జోహార్’ సినిమా విడుదలపై ముంబయి హైకోర్టు గురువారం నిషేధాజ్ఞలు ఇచ్చింది. ఈ సినిమా విడుదల చేసే ముందు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత జోహార్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తప్పనిసరి తొలగించాలని ఆదేశించింది. ఆయన పేరును అనధికారికంగా ఉపయోగించటం వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించటమే అవుతుందని కోర్టు నొక్కి చెప్పింది. ‘షాదీ కే డైరెక్టర్ కరణ్ ఔర్ జోహార్’ శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా నిర్మాతలైన సంజయ్ సింగ్‌తోపాటు రచయిత బబ్లూ సింగ్‌లు తన పేరు సినిమా టైటిల్‌లో ఉపయోగించకుండా నిషేధాజ్ఞలు ఇవ్వాలని కోరుతూ బాధితుడు జోహార్ కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ చిత్ర నిర్మాతగా అతని హోదాను దృష్టిలో ఉంచుకొని, ఆయన పేరు టైటిల్‌లో రాకుండా ఉండేలా దాన్ని మార్చాలని జస్టిస్ చాగ్లా సూచించారు. సంబంధిత ఫిల్మ్ మేకర్స్‌కు ముందస్తు నోటీసులు ఇచ్చినా వారు బెంచ్ ముందు హాజరుకాలేదు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటాన్ని ఎత్తిచూపుతూ, జస్టిస్ చాగ్లా వ్యక్తిగత హక్కులను సమర్ధించారు. అతని పేరును చట్ట విరుద్ధంగా ఉపయోగించకూడదన్న ఉద్దేశంతో ఈ సినిమాను నిలిపివేయాలని కోర్టు నిర్ధారించింది.