బహుజనుల గొంతుకగా పనిచేస్తా
మోసం చేయటంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే గూటి పక్షులు
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
రంగారెడ్డి/చాంద్రాయణగుట్ట, మే 2 (విజయక్రాంతి): ప్రజాసేవ చేసేందుకే ఐపీఎస్ సర్వీస్ వదలి రాజకీయాలోకి అడుగు పెట్టానని నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. తనను పార్లమెంట్‌కు పంపిస్తే నాగర్‌కర్నూల్ సమస్యలపై గళం ఎత్తుతానని హామీ ఇచ్చారు. ఆమనగల్లు, మాడ్గుల మండలాల్లో ఎన్నికల ప్రచారంలో గురువారం ఆయన పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంతూసేవాల్, అంబేడ్కర్, జ్యోతిబాపూలే చూపిన మార్గాన్ని అనసరిస్తూ బహుజనవర్గాల గొంతుకగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తానని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో కరెంటు, నీటి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు అభివృద్ధిపై ఎక్కడా మాట్లాడకుండా కేవలం మతం, కులం పేరుతో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఉప్పుగూడ డివిజన్‌లో సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకే గూటి పక్షులని ఎద్దేవా చేశారు.




