రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా పట్టిండు
ఆయన సీఎం అయ్యాకే కరువొచ్చింది
ఎన్నికల్లో గుంపు మేస్త్రీ గూబ గుయ్యిమనేలా సమాధానం చెప్పాలి
గుమ్మడిదల రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
పటాన్‌చెరు, మే 2: రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా పట్టిండు.. ఆయన సీఎం అయ్యాకే రాష్ట్రంలో కరువొచ్చింది.. మాట్లాడితే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నా డే తప్ప ఆరు గ్యారెంటీలను అమలు చేస్తా అని చెప్పడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో గురువారం రాత్రి మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డికి మద్దతు గా నిర్వహించిన రోడ్ షోలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పు డు మాట మార్చిండని, చెప్పిన మాటలన్నీ నీటి మూటలే అయ్యాయని మండిపడ్డారు.
ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్లపై ఒట్లు వేస్తున్నాడని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు గాడిద గుడ్డే ఇచ్చిందని రేవంత్ రెడ్డి అంటున్నాడని, వాళ్లు గాడిద గుడ్డే ఇచ్చారని పదేళ్ల నుంచి మేము మొత్తుకుంటున్నామని తెలిపారు. నాలుగు నెలల పాలనలో నువ్వు తెలంగాణకు ఇచ్చిందేముంది గాడిద గుడ్డు తప్ప అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియోలను స్క్రీన్‌ల ద్వారా ఒక్కొక్కటిగా ప్రజలకు చూపించారు. ఎంపీ ఎన్నికల్లో గుంపు మేస్త్రీ గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలన్నారు. రేవంత్‌రెడ్డికి అహంకారం పెరిగిందని, మాజీ సీఎం కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఉప ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడని, అందుకే గత ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు చిత్తుగా ఓడించారని విమర్శించారు. దుబ్బాకలో చెల్లని రూపా యి మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థికి నిలకడలేదని, బీజేపీ అభ్యర్థి మాటమీద నిలబడడని విమర్శించారు. వెంకట్రాంరెడ్డి మాజీ కలెక్టర్, చదువుకున్న వ్యక్తి అని, తన కుటుంబ ఆస్తి నుంచి వంద కోట్లు ప్రజా సేవ కోసం ఖర్చు చేస్తానని వస్తున్నాడని, అలాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో గుమ్మడిదల జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, పార్టీ జిల్లా నాయకుడు గోవర్దన్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




