ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!
ఈవీ బస్సులన్నీ వారివే..
- డిపోలనూ హస్తగతం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాలు
ఈవీ అద్దె బస్సులకు డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు
ఆర్టీసీకి ఎలాంటి అద్దె చెల్లించని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): మొన్నటికి మొన్న నీటిపారుదల శాఖలో సలహాదారులుగా, ఆయనకు సహాయకులుగా, ఓఎస్‌డీగా.. అందరూ ఆంధ్రా నుంచి దిగుమతి అయ్యారు. నిన్నటికి నిన్న విద్యుత్ సంస్థల్లోనూ డీఈఈ స్థాయి అధికారులను కూడా ఆంధ్రా నుంచి తెచ్చి పెద్దపీట వేశారు. ఇవి కేవలం రెండు శాఖలే కాదు.. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఆంధ్రా నుంచి వచ్చి చేరుతున్నవారి సంఖ్య మెల్లగా పెరుగుతున్నది.
గతంలో గప్‌చిప్‌గా ఆంధ్రా నుంచి అధికారులు, సిబ్బందిని తెచ్చిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. సొంత రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఇప్పుడు బాహాటంగానే ఆంధ్రా నుంచి అధికారులను తెచ్చి పెట్టుకుంటున్నారు. మన ప్రభుత్వం.. మన ఉద్యోగులు, అధికారులు, ప్రజల కోసం కాకుండా.. పక్క రాష్ట్రం అధికారులు, ప్రజలు, రాజకీయ నేతలకోసం పనిచేస్తున్నట్టుగా ఉందని ఉద్యోగ సంఘాలు కూడా నెత్తినోరూ కొట్టుకుంటున్నాయి.
శాఖలే కాదు.. ఆఖరికి కాంట్రాక్టులు, వ్యాపారాలు, సంస్థలు, కంపెనీలు.. తెలంగాణలో భూములు అన్నీకూడా ఆంధ్రా నాయకులు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల వశమైపోతున్నాయి.. తాజాగా సింగరేణిలో తీవ్ర విమర్శలకు దారితీసిన నైనీ కోల్‌మైన్ వ్యవహారంలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్ల ప్రమేయం స్పష్టంగా ఉందని అందరికీ తెలిసిందే. మరి రేపు ఏం జరుగుతుందనే ప్రశ్నకు సమాధానంగా..
అందరి చూపు ఆర్టీసీపై కేంద్రీకృతమయ్యింది. గడిచిన కొంతకాలంగా ఆర్టీసీలో జరుగుతున్న సంఘటన లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల న్నీ.. ఆంధ్రా వ్యాపారవేత్తలకు అనుకూలంగా కనపడుతుండటంతో.. త్వరలోనే ఆంధ్రో ళ్ల చేతుల్లోకి ఆర్టీసీ వెళ్ళనుందనే అనుమానాలను ఆర్టీసీ కార్మిక సంఘాలు బలం గా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఈవీ బస్సులతో శ్రీకారం..
పర్యావరణహితం, కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈవీ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం.. ఆంధ్రా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చుకున్నారని కార్మిక సంఘాల ఆరోపణల వెనుక వాస్తవాలుకూడా అదే రకంగా కనపడుతున్నాయి. ఆర్టీసీలో ఈవీ బస్సులను విడతలుగా ప్రవేశపెట్టే నెపంతో.. ఆర్టీసీ డిపోలపై ఆంధ్రాపెట్టుబడిదారులకు చెందిన ప్రైవే టు కార్పొరేట్ సంస్థల అజమాయిషీకి తెరవెనుక కుట్ర జరిగిందని ఆర్టీసీ కార్మికవర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇందులో భాగంగానే.. కేవలం ఆంధ్రా, ఉత్తరాది పెట్టుబడిదారులకు మాత్రమే ఈవీ బస్సులను తయారుచేసి అద్దెకు ఇచ్చే కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 500 వరకు ఈవీ బస్సులను నడిపిస్తున్నారు. ఈ బస్సులను సదరు ప్రైవేటు కార్పొరేట్ కంపెనీ లు తయారుచేసి.. కేంద్రం నుంచి ఒక్కో బస్సుకు వచ్చే రూ. 36 లక్షల గ్రాంట్‌ను తీసుకుని.. ఆర్టీసీ సంస్థకు ఆ ఈవీ బస్సులను అద్దెకు ఇస్తున్నారు.
ఒక కంపెనీ బస్సుకు కిలోమీటరుకు రూ. 40.50 పైసలు అద్దెగా చెల్లిస్తుండగా.. మరో కంపెనీకి మాత్రం కిలోమీటరుకు రూ. 60 చొప్పున చెల్లిస్తున్నారు. ఈవీ బస్సుల విషయంలో అనే క కంపెనీలు ఉన్నప్పటికీ.. కేవలం ఆంధ్రా పె ట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వం చ ర్యలు తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.
డిపోలపై అజమాయిషీ షురూ..
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సుమారు 96 డిపోలు ఉన్నాయి. ప్రస్తుతానికి 500 ఈవీ బస్సులను మాత్రమే నడిపిస్తున్నారు. త్వర లో మరికొన్ని రానున్నాయి. రెండేండ్లలో 3000 ఈవీ బస్సులను ప్రవేశపెట్టేలా ప్రణాళికను అమలు చేస్తున్నారు. రాబోయే ఐదారు ఏండ్లలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఈవీ బస్సులే నడిపించాలని రాష్ట్ర ప్రభు త్వం కంకణం కట్టుకుని ముందుకు సాగుతోంది.
అయితే ప్రైవేటు కార్పొరేట్ సంస్థల కు చెందిన ఈవీ బస్సులు ఛార్జింగ్ చేసుకోవడానికి, వాటిని సురక్షితంగా చూసుకో వడానికి ఆర్టీసీ డిపోలను ఉపయోగించడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సంస్థకు అద్దెకు ఇచ్చిన ఈవీ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయడం.. సదరు ఈవీ బస్సుల సంరక్షణ చూసుకోవడానికి ఆర్టీసీ డిపోలను వాడుకోవడం వెనుక మెల్ల గా అజమాయిషీని ఆంధ్రా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడమేనని కార్మిక వర్గాలు బలంగా ఆరోపిస్తున్నాయి.ప్రైవేటు సంస్థలు అద్దెకు ఇచ్చే ఈవీ బస్సులకు ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పా టు చేయాలి.
ఇందుకోసం ఆర్టీసీ సంస్థ తమ సొంత డిపోల్లో సుమారు రూ. 10 నుంచి రూ. 12 కోట్ల వరకు ఖర్చు చేయాల్సివస్తోందని కార్మికవర్గాలు బలంగా చెబుతున్నాయి. ఈవీ సబ్‌స్టేషన్ ఖర్చును ఆర్టీసీ సంస్థ భరిస్తుండగా.. ఇన్‌స్టలేషన్ ఖర్చు మాత్రమే ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు భరిస్తున్నాయి. తమ డిపోలను, డిపోల్లోని స్థలా లను ఉపయోగించుకున్నందుకు మాత్రం సదరు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ఎలాంటి అద్దెలు చెల్లించడం లేదని.. ఇది ఆర్టీసీకి ఉన్న డిపోలు, విలువైన స్థలాలపై ప్రైవేటు కంపెనీలకు అజమాయిషీని కట్టబెట్టేలా వ్యవ హరించడ మేనని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అజమాయిషీ ప్రైవేటు సంస్థలకు..
ఈవీ అద్దె బస్సులను ప్రవేశపెట్టి.. ఇప్పటికే పలు డిపోలపై ప్రైవేటు కార్పొరేట్ సంస్థల అజమాయిషీని ప్రణాళికాబద్ధంగా అప్పగించిన ప్రభుత్వం.. ఇటు ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలను మాత్రం ఇవ్వకుండా మరింత అప్పుల్లోకి ఆర్టీసీ సంస్థ కూరుకు పోయేలా వ్యవహరిస్తుందని కార్మికులు అవేదన చెందుతున్నారు. ఇప్పటికే పలు ఆస్తులను కాంట్రాక్టర్లకు, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన ప్రభుత్వం..
విడతలవారీగా పూర్తి స్థాయిలో ఈవీ బస్సులను ప్రవేశపెడితే.. ఆర్టీసీ సంస్థకు ఎలాంటి అజమాయిషీ ఉండదని.. ఆపై మెల్లగా అన్ని డిపోలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ.. మొత్తంగా ఆర్టీసీనే ప్రైవేటు పరం చేస్తారనే అనుమానాలను కార్మిక సంఘాలు బలంగా చెబుతున్నాయి. ఈవీ బస్సులు, వాటి నిర్వహణ చేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. డిపోలు వాడు కుంటున్నందుకు ఎలాంటి అద్దెను చెల్లించకపోవడం వెనుక..
ఆర్టీసీని అప్పనంగా ఆంధ్రా గుత్తేదార్లకు అప్పగించడమే లక్ష్యమని వారు ఆరోపిస్తున్నారు. ఈవీ బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వెనుక.. ఉన్న కుట్రకూడా ఇదేనని వారంటు న్నారు. భవిష్యత్తులో ఇదే జరుగుతుందని.. వివిధ శాఖల్లోకి మెల్లగా ఆంధ్రా అధికారులను, సిబ్బందిని చొప్పిస్తున్నారో.. అదే విధంగా ఆర్టీసీకిలోకి ఆంధ్రా వ్యాపారుల నుకూడా చొప్పిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే.. ఆర్టీసీ పూర్తిగా ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయమని బలంగా చెబుతున్నారు.




