3 August, 2026 | 2:00 AM

కేసీఆర్ చేతిలో ఆర్‌ఎస్పీ కీలుబొమ్మ

27-05-2024 01:58 AM

పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): అచ్చంపేట, అలంపూర్ ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించాలంటూ బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి మండిపడ్డారు. కేసీఆర్ చేతిలో ప్రవీణ్ కుమార్ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు.  కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు బడుగు బలహీనవర్గాల పిల్లలను కాల్చి చంపారని, అనంతపూర్‌లో ఎస్పీగా ఉండగా పరిటాల రవి హత్య జరిగిందని ఆయన విమర్శించారు. గాంధీభవన్‌లో ఎమ్మె ల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డితో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..

కల్లోలిత ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ చేసినట్లు అనుకుంటున్నావా? అని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ వ్యూహాలను ప్రవీణ్‌కుమార్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొల్లాపూర్‌లో బుల్డోజర్‌తో ఇళ్లు కూలగొడుతున్నారని, శ్రీధర్‌రెడ్డి హత్య కాంగ్రెస్ చేయించిదన్న ఆరోపణలను మల్లు రవి ఖండించారు. శ్రీధర్‌రెడ్డి హత్య విషయంలో విచారణ జరుగుతుందని, హత్యలో ఎవరి ప్రమేయం ఉన్నా పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ప్రవీణ్ వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, సీఎం రేవంత్‌రెడ్డిపై అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. జూన్ 4 తర్వాత నాగర్‌కర్నూల్‌లో సభ పెట్టి చెబుతామని, బీఆర్‌ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.