3 August, 2026 | 12:58 AM

బాలుడి ఛాతీలో బాణం

27-05-2024 02:01 AM

4 గంటలు శ్రమించి కాపాడిన నిమ్స్ వైద్యులు

డాక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో సుమారు 24 గంటలు విలవిల్లాడుతూ నరకయాతన అనుభవించిన సోదినంద అనే బాలుడికి నిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. విష యం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి నిమ్స్ వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాపాయం లేకుం డా చాకచక్యంగా బాణాన్ని తొలగించారని ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రశంసించారు.

ప్రజల్లో నిమ్స్‌పై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారని కొనియాడారు. భవిష్యత్తులో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్యసేవలు అందించాలని ఆకాంక్షించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతానికి చెందిన సోదినంద(17)కు వారంరోజుల క్రితం ప్రమాదవశాత్తూ బాణం గుచ్చుకుంది. సరిగ్గా గుండె, ఊపిరితిత్తుల మధ్యలో దిగటంతో బాధితుడి ని కుటుంబ సభ్యులు భద్రాచలం ఆసుపత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకి తీసుకువెళ్లారు. అయితే పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కార్డియోథొ రాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర్‌రావు బృందం దాదాపు 4 గంటలు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.