3 August, 2026 | 3:22 AM

గుట్కా, పాన్‌మసాలాపై నిషేధం

27-05-2024 01:55 AM

సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష అనంతరం అధికారుల నిర్ణయం

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా తయారీ.. అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించి మాదకద్రవ్యాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

మత్తు పదార్థాల వినియోగం వల్ల రాష్ట్రంలో యువత  చెడు మార్గంలో వెళ్తున్నారని, వారి ఆరోగ్యం పాడు చేసు కుంటున్నారనే భావనను ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ కంట్రోల్ బృందాలను సైతం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గుట్కా, పాన్ మసాలా వల్ల కూడా అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, వీటిని కూడా రాష్ట్రంలో కనిపించకుండా చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు మరుసటి రోజే నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సమీక్ష నేపథ్యంలో ఆదివారం సర్కారు గుట్కా, పాన్ మసాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

పొగాకు, నికోటిన్ కలిగి ఉన్న గుట్కాలు, పాన్ మసాలాలు రాష్ట్రంలో తయారు చేయకుండా, విక్రయాలు జరపకుండా, వాటిని సరఫరా చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అధికారులు ఈ ఉత్తర్వులను ఆదివారం జారీ చేయగా... నిషేధం మాత్రం ఈ నెల 24 నుంచే అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో గుట్కా, పాన్‌మసాల నిషేధంపై కూడా కఠినంగా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గుట్కా, పాన్ మసాల విక్రయాలు చేయడం, వాటిని సరఫరా చేసే వారిపై కఠినంగా శిక్షించే అవకాశం ఉంది.