02-10-2025 01:43:55 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 2: నిరుపేదల జీవితాల్లో మార్పులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కృషి చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలోని బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన రూ.100 నాణెంతో పాటు పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని మాట్లాడు తూ.. ‘ఒక జీవనది ప్రవాహం ఒక ప్రాం తాన్ని సస్యశ్యామలం చేస్తుంది. పుడమిపై పచ్చదనం పరిఢవిల్లేలా చేస్తుంది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ కూడా వందేళ్ల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నది. విద్య, వైద్యపరంగా సహాయ, సహకారాలు అందిస్తున్నది. రైతాంగానికి అండగా నిలుస్తున్నది. భార త సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షిస్తున్నది.
ఆర్‌ఎస్‌ఎస్ చేసే ప్రతి పనిలో భారతీయత ఉట్టిపడుతుంది. అలాంటి సంస్థను అణచివేసేందుకు ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయించాయి. సంస్థపై నిషేధం విధించేందుకూ యత్నించాయి. అన్ని ఆటుపోట్లను తట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్ నిలబడింది. దశాబ్దాలుగా అవిశ్రాంతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల భక్తి, నిబద్ధత, సేవ, త్యాగం వెలకట్టలేనివి’ అని కొనియాడారు.
సంస్థ శతాబ్ది ఉత్సవాలను చూసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. సంస్థ పరిధిలో విభిన్నమైన విభాగాలు ఉన్నప్పటికీ, ఏనాడూ వాటి మధ్య స్పర్థ రాలేదని కొనియాడారు. ఆయా సంస్థలన్నీ కేవలం లక్ష్య సాధన కోసమే పనిచేస్తున్నాయని, దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాయని శ్లాఘించారు. ఉత్సవాల్లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబాలె, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా తదితరులు పాల్గొన్నారు.
కరెన్సీపై తొలిసారి భరతమాత
రూ.100 నాణెం ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నాణేనికి ఒకవైపు జాతీయ చిహ్నం, మరోవైపు భరతమాత చిత్రం ఉంటుందని, దేశ చరిత్రలో ఇప్పటివరకు నాణెంపై భరతమాత చిత్రాన్ని ముద్రిం చడం ఇదే మొదటిసారి అని తెలిపారు. భారతమాత రాజసం ఉట్టిపడేలా ఉంటుందని, ఆమెకు కుడివైపు సింహం ఉండగా, ఎడమ వైపు స్వయంసేవకులు భక్తి, అంకితభావంతో ఆమెకు నమస్కరిస్తున్న విధంగా నాణేన్ని ముద్రించామని వెల్లడించారు. అలాగే నాణెం పై ‘రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం నమమ’ అనే ఆర్‌ఎస్‌ఎస్ నినాదమూ ము ద్రించి ఉంటుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లుగా దేశానికి అందించిన సేవలకు గుర్తుగా రూ.100 నాణేన్ని ముద్రించామని వివరించారు.