calender_icon.png 2 October, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఓకేలో పాక్ సైన్యం కాల్పులు

02-10-2025 01:11:35 AM

  1. తాజాగా ఎనిమిది మంది మృతి.. పదికి చేరిన మృతుల సంఖ్య

లాక్‌డౌన్‌లోకి బలోచిస్థాన్ ప్రజలు 

ఇస్లామాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మూడో రోజు బుధవారం కూడా ఆక్రమిత కాశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగడంతో, పరిస్థితిని నియంత్రించే ప్రయత్నంలో సాయుధ దళాలు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది పౌరులు మరణించారు. 

బాగ్ జిల్లాలోని ధీర్కోట్లో నలుగురు, ముజఫరాబాద్‌లో ఇద్దరు, మిర్పూర్‌లో ఇద్దరు మరణించారని అక్కడి మీడియా తెలిపింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య పదికి చేరిందని వెల్లడించింది.

‘షటర్ డౌన్.. వీల్ పేరిట నిరసనలు

పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, 38 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జమ్ము కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేకేజేఏసీ) ‘షటర్ డౌన్.. వీల్ పేరిట కొన్ని రోజులుగా పీఓకేలో నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం ప్రాథమిక హక్కులను విస్మరించిందని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమైందని నిరసనకారులు ఆరోపించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతుండడంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభు త్వం బలగాలను మోహరించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మంగళవారం ఆందోళనకారు లు రాళ్లు రువ్వడంతో పాటు తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు.

ఈ క్రమంలో జరిగిన కాల్పు ల్లో ఇద్దరు నిరసనకారులు మృతిచెందారని మీడియా పేర్కొంది. ప్రస్తుత నిరసనలు ప్లాన్ ఏ అని, ఇంకా తమ వద్ద వేరే వ్యూహాలు ఉన్నాయని జేకేజేఏసీ నేత సౌకత్ నవాజ్ మిర్ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

 డ్రోన్లతో నిఘా.. 

వేర్పాటు వాదుల ఆధీనంలో గల కుజ్జార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్ సైన్యం బలోచిస్థాన్‌లో సొంత ప్రజలపైనే దాడులు చేస్తోంది. ఇటీవల పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బలోచ్ లిబరేషన్(బీఎల్‌ఏ), బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) వేర్పాటువాద సంస్థల ఆధీనంలోని జెహ్రీ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది.

నాలుగు రోజులుగా డ్రోన్ల సహకారంతో పాక్ సేనలు శతఘ్నులు, మోర్టార్లతో చేస్తున్న దాడులతో జెహ్రీ ప్రాంత ప్రజలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. వారికి ఆహారం, ఇంధనం కొరత ఏర్పడిందని, వరుస బాంబు దాడుల్లో పత్తి పంటలు ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. చశ్మా ప్రాంతంలో మరణాలూ సంభవించాయి.