19 March, 2026 | 11:32 AM

ఆర్టీసీ వర్క్‌షాప్‌లు.. ప్రభుత్వానికి కనిపించవా?

19-03-2026 02:22 AM
  1. మియాపూర్, కరీంనగర్, ఉప్పల్‌లో మూలుగుతున్న వర్క్‌షాప్‌లు
  2. టెక్నీషియన్లు, శ్రామిక్‌ల నైపుణ్యానికి కొదువలేదు 
  3. డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చుకునేలా అనుమతి ఇవ్వాలని కార్మిక సంఘాల విజ్ఞప్తి

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): పై ఫోటోలోని బస్సు చూశా రా..? సాధారణ బస్సులాగే కనపడుతుంది కదా. వాస్తవానికి ఇది ఆర్టీసీ లోని డీజిల్ బస్సు (ఏపీ 11 జడ్ 7282). అయితే మూడేండ్ల  క్రితం రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో, డీజిల్ బస్సును పూర్తిగా ఎలక్ట్రికల్ బస్సుగా మార్చారు. మీరు ఇప్పుడు చూస్తున్న బస్సు ఇదే. ఒక ప్రైవేటు సంస్థ సహకారంతో ఎలక్ట్రికల్ బస్సుగా మార్చారు.

ఇలా ఎలక్ట్రికల్ బస్సుగా మార్చిన తరువాత ఉప్పల్‌లో డిపోలో పనిచేసే సిబ్బంది, టెక్నీషియన్లే దీని నిర్వహణ చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఉప్పల్ డిపోలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పూర్తి ఉచిత ప్రయాణానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు తయారుచేసే ఈవీ బస్సులతో పోటీపడుతూ ఎలాం టి ఇబ్బందిలేకుండా ఈ బస్సు సేవలు అందిస్తుండటం గమనార్హం.

మూడు వర్క్‌షాప్‌ల ఘనత..

రాష్ట్రవ్యాప్తంగా మియాపూర్, ఉప్పల్, కరీంనగర్‌లలో ఆర్టీసీకి వర్క్‌షాప్‌లు ఉన్నాయి. ఇక్కడ వందల సంఖ్యలో ఉండే శ్రామిక్‌లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు కలిసి ఆర్టీసీకి ఎంతో ఘనమైన బస్సులను అందించారు. ఒకప్పుడు మియాపూర్ వర్క్‌షాప్‌లో బస్సులు.. ఆశోక్ లేలాండ్ బస్సులతో పో టీపడేలా కొత్త బస్సులను తయారుచేసేవారు. 1990 దశకంలో ఢిల్లీ నుంచి ప్రజార వాణా విభాగం అధికారులు, ఇంజనీర్లు వ చ్చి.. మియాపూర్ వర్క్‌షాప్‌లో కొత్త బస్సు ల విధానంపై అధ్యయనం చేసి వెళ్ళి.. అక్కడ కొత్త బస్సులను తయారు చేయడం గమనార్హం.

దేశవ్యాప్తంగా ఉండే ప్రజా రవాణా బస్సుల్లో.. తెలంగాణ (ఒకప్పుడు ఉమ్మడి ఏపీ) బస్సులు ప్రత్యేకంగా కనపడతాయి. బ స్సుల డిజైన్, టెక్నాలజీ, సీటింగ్, రంగులు.. ఏ రకంగా చూసినా ప్రత్యేకంగా, సౌకర్యవంతంగా ఉండేలా తయారుచేయడం మనకు తెలిసిందే. అలాగే ఉప్పల్, కరీంనగర్‌లో బస్సుల మరమ్మత్తులతోపాటు.. రెండోసారి బస్సుల నిర్మాణం కోసం ఎక్కువగా ఉపయోగించేవారు. ఎలాంటి మరమ్మత్తు అయినా, ఈ వర్క్‌షాప్‌లలో చేసేవారు.

పూర్తి నిర్లక్ష్యం..

ఇదంతా ఒకప్పటి మాట.. గడిచిన కొద్ది కాలంగా ఆర్టీసీలోని వర్క్‌షాప్‌లకు పని ఉం డటం లేదు.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు 400 మంది టెక్నీషియన్లు ఉండే మియాపూర్ వర్క్‌షాప్‌లో ఇప్పుడు కే వలం 60-70 మంది వరకు మాత్రమే ఉం టున్నారు. మిగతా ఉప్పల్, కరీంనగర్ వర్క్‌షాప్‌ల పరిస్థితికూడా అంతంతే. ఎంతో మే ధాశక్తి, టెక్నాలజీ, శక్తిసామర్థ్యాలు ఉన్న ఈ వర్క్ షాప్‌లను ప్రభుత్వ సరిగా ఉపయోగించుకోవడం లేదనే ఇరోపణలకు ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతోంది.

ఉప్పల్ వర్క్‌షాప్‌లో బస్సుల తయారీ, మరమ్మత్తులకు సంబంధించి అనేక విలువైన యంత్రాలున్నాయి. కానీ వాటిని ఉపయోగించడం ఎప్పుడో మానేశారు. ఎలాంటి బస్సులనైనా తయారుచేయగల శక్తిసామర్థ్యాలు ఉన్న ఈ వర్క్‌షా ప్‌లను మూలకు పడేస్తున్నారు. ప్రభుత్వం ఉన్న వనరులను ఉపయోగించడం మానే సి.. ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవడం మొదలుపెట్టడంపై కార్మికవర్గాల్లో తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తమవుతున్నది.

కొద్దిపాటి శిక్షణ చాలు..

తాజాగా ప్రైవేటు సంస్థ సహకారంతో డీజిల్ బస్సును ఈవీ బస్సుగా మార్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అది సుమారు మూడేండ్లుగా సేవలు అందిస్తోంది. అదే రీతిన మిగతా బస్సులనుకూడా ఆర్టీసీ వర్క్‌షాప్‌లలో మార్చుకునే సత్తాకూడా ఉంది. ఇందుకు కేవలం కొద్దిపాటి శిక్షణ చాలు. 15 నుంచి నెల రోజులపాటు టెక్నీషియన్లకు ప్రస్తుతం ఉన్న అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణ ఇస్తే సరిపోతుందని వారు ఆంటున్నారు. 

ఉద్యోగ భద్రత.. 

ఇప్పటికే 500 ఈవీ బస్సులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థ నుంచి తీసుకొచ్చి.. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చారు. మరిన్ని ఈవీ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. ఆర్టీసీలో ఉన్న వేలాది డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చితే.. ప్రైవేటుకు అద్దె చెల్లించే భారం తగ్గుతుంది. పైగా.. ప్రైవేటు ఈవీ బస్సుల్లో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు అందరూ.. ఆయా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలే ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుంటున్నాయి.

అలా కాకుండా.. ఆర్టీసీలో ఉన్న వేలాది డీజిల్ బస్సులను మనమే మార్చుకుంటే.. కేంద్రం నుంచి ఒక్కో బస్సుకు రూ. 36 లక్షల గ్రాంట్ ఆర్టీసీకే వస్తుంది. పైగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రావాల్సిన రూ. 2,500 కోట్లను ఆర్టీసీకి ఇచ్చి.. కొద్దిపాటి శిక్షణ ఇస్తే.. రాష్ట్రం మొత్తం డీజిల్ బస్సులను విడతలుగా ఈవీ బస్సులుగా మార్చే శక్తిసామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకున్నట్టవు తుంది.

ఆర్టీసీలోని డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు, అధికారులకు తమ సొంత బస్సుల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. దీనితో ఉద్యోగ భద్రత కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే.. ఆర్టీసీ తిరిగి ప్రాణం పోసుకుంటుంది. కానీ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పితే, ఆర్టీసీ మనుగడ ప్రమాదంలో పడటం ఖాయమని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.

ఈవీ బస్సుల తయారీకికూడా.. 

ప్రభుత్వం కొద్దికాలం క్రితం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. పర్యావరణహితం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. అయితే ఈవీ బస్సులను ్రప్రైవేటు కార్పొరేట్ సంస్థల నుంచి తీసుకొస్తూ, ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నారు. కానీ ఆర్టీసీ వర్క్‌షాప్‌లలో ఉన్న  టెక్నీషియన్లు, శ్రామిక్‌లు, సిబ్బంది, ఇంజనీర్లను వినియోగించుకోవడం లేదు. ఆర్టీసీలో ఉన్న వేలాది డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చే శక్తిసామర్థ్యాలు ఆర్టీసీ వర్క్‌షాప్‌లకు ఉన్నా.. కేవలం కార్పొరేట్ సంస్థలకు లాభం కలిగించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపించడంలో వాస్తవం ఉన్నట్టుగా అర్థమవుతోంది.

దేశంలోని అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తెలంగాణలోనే (ఒకప్పుడు ఉమ్మడి ఏపీ) చాలా అందమైన, సౌకర్యవంతమైన బస్సులు ఉండేవి. ఇవన్నీ వర్క్‌షాప్‌లలోనే తయారు చేసినవే. అలాంటి టెక్నీషియన్లు ఈవీ బస్సులనుకూడా తయారు చేయగలరని కార్మిక సంఘాలు గట్టిగా చెబుతున్నాయి. డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చడానికి ఆర్టీసీకి అనుమతి ఇవ్వాలనికూడా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. 

పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి.. 

మియాపూర్, కరీంనగర్, ఉప్పల్ వర్క్‌షాప్‌లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. డీజిల్ బస్సులను ఈవీ బస్సులుగా మార్చగలిగే శక్తిసామర్థ్యాలు వర్క్‌షాప్‌లకు ఉన్నాయి. కొద్ది కాలంగా వీటిని పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఏటికేడు తగ్గుతున్నారు. కొత్త రిక్రూట్‌మెంట్లు లేవు. ప్రయోగాత్మకంగా ఒక డీజిల్ బస్సును ఈవీ బస్సుగా మార్చారు. గడిచిన మూడేండ్లుగా అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తోంది. దీని నిర్వహణను ఉప్పల్ డిపోలోని ఆర్టీసీ సిబ్బందే చూసుకుంటున్నారు.

వర్క్‌షాప్‌లోని టెక్నీషియన్లకు, శ్రామిక్‌లకు కొద్దిపాటి శిక్షణ ఇస్తే.. ఈవీ బస్సులు తయారు చేయడం ఏమంత కష్టం కాదు. పైగా ఆర్టీసీకి గర్వకారణంకూడా. ప్రైవేటు సంస్థలకు చెల్లించే అద్దెలు మిగులుతాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు, సబ్సిడీలు ఆర్టీసీకి ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రావాల్సిన రూ. 2,500 కోట్లు ప్రభుత్వ ఇచ్చి.. ఈవీ బస్సులుగా మార్చుకునే వెసులుబాటును ఇస్తే.. ఆర్టీసీకి జవసత్వాలు వస్తాయి. తిరిగి ప్రాణం పోసుకుంటుంది.

 ఈదురు వెంకన్న,

ఆర్టీసీ జేఏసీ చైర్మన్,

ఈయూ జనరల్ సెక్రెటరీ