calender_icon.png 4 December, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సును అడ్డుకున్న మందుబాబు

04-12-2025 09:45:05 PM

డ్రైవర్, ప్రయాణికుల పట్ల దురుసు ప్రవర్తన..

సిద్దిపేట క్రైం: తాగిన మైకంలో ఓ యువకుడు రోడ్డుపై హంగామా చేశాడు. ఆర్టీసీ బస్సు పక్క నుంచి వెళ్లిందని బైక్ పై వెంబడించి ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. బస్ డ్రైవర్, ప్రయాణికులను దూషించాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బరిగెల కల్యాణ్ అనే వ్యక్తి ఈ నెల 2న గుండారం గ్రామంలో తన బంధువుల ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్లాడు. అక్కడ మద్యం తాగి సిద్దిపేటకు బయలుదేరాడు. మార్గమధ్యంలో శనిగరం స్టేజి వద్ద  కరీంనగర్ వైపు నుంచి వస్తున్న మంచిర్యాల డిపో  బస్సు కల్యాణ్ నడుపుతున్న బైక్  పక్కన నుంచి వెళ్లింది. దాంతో కోపోద్రిక్తుడైన కల్యాణ్ ఓవర్ టేక్ చేసి బస్సు ముందు తన బైక్ ను అటు, ఇటు తిప్పుతూ ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డాడు.

పొన్నాల గ్రామ శివారులో ఫేమస్ హోటల్ వద్ద తన బైక్ ను అడ్డుపెట్టి బస్సును ఆపి, డ్రైవర్ ను, ప్రయాణికులను దూషించాడు. సమాచారం అందుకున్న సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సిబ్బందితో వెళ్లి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్ డ్రైవర్ కోట నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. బైక్, డ్రైవింగ్ లైసెన్స్ ను సీజ్ చేసి కోర్టుకు తరలించారు.