2 August, 2026 | 4:46 AM

నిబంధనలా.. అయితే ఏంటి?

24-08-2024 02:24 AM
  1. అనుమతులు లేకుండా తరగతులు 
  2. నిద్రమత్తులో విద్యాశాఖ

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 23(విజయక్రాంతి): ఏజెన్సీప్రాంతమైన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాశాఖ గాఢనిద్రలో ఉండడంతో అనుమతిలేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా  పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు బేఖాతరు చేస్తూ అనుమతులతో పనిలేకుండా ఎవరు పడితే వాళ్లు పాఠశాలలు, కాలేజీలు నడిపేస్తున్నారు. ఉదాహరణకు చుంచుపల్లి మండలం నంద తండాలో చైతన్య పాఠశాలను  ఓ అద్దె బిల్డింగ్‌లో జూన్‌లో  కొత్తగా ఏర్పాటు చేశారు.

అడ్మిషన్ ఫీజులు, బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, ప్రాజెక్టులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి  వేలల్లో డబ్బులు గుంజుతున్నారు. ఇంతవరకు స్కూల్ బోర్డు కూడా పెట్టకుండానే, అనుమతి లేకుండానే  క్లాసులను నిర్వహిస్తూ కోట్లు దండుకొంటున్నారు. అధికారుల అండదండలు  ఉండడంతోనే అనుమతులు లేకున్నా స్కూళ్లను నడిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు కో కొల్లలుగా ఉన్నాయి.

వాటిని అరికట్టాల్సిన జిల్లా విద్యాశాఖ మామూళ్ల మత్తులో తూలుతుండడంతో ప్రవేటు యాజమన్యాలు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. చైతన్యపాఠశాల అనుమతులపై ఎంఈవో జుమ్మికిలాల్‌ను వివరణ కోరగా చైతన్య యాజమాన్యం 8,9,10 తరగతులుకు ఓపీ(ఓపెనింగ్ పర్మిషన్) కోసం దరఖాస్తు చేసుకొన్నారని, ఇంకా అనుమతులు రాలేదన్నారు. ఇదే  తరహలో పాల్వంచలోనూ నలందా పాఠశాల నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.