17 July, 2026 | 1:42 AM

ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీ కార్యాలయం..!

17-07-2026 01:42 AM

కూత వేటు దూరంలోనే రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాలు 

అధికారుల అలసత్వమా.. రాజకీయ నేతల దర్పమా..!?

కోట్ల విలువచేసే జాగాలో కాంగ్రెస్ పార్టీ కార్యాల నిర్మాణ పనులు

ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం

నాగర్ కర్నూల్ జూలై 16 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని అక్రమంగా ప్రభుత్వ భూమిలో చేపడుతున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకునే ఆ పార్టీ ప్రభుత్వ జాగలోనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తాసిల్దార్, ఆర్డీవో కార్యాలయాలతో పాటు మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ప్రధాన రహదారి ముందర ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నప్పటికీ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడం వెనక పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణం ప్రభుత్వ జాగలోనే జరుగుతోందని బహుజన్ సమాజ్ పార్టీ నేతలు సోమవారం ప్రజావాణి వేదికగా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఆ తరువాతే నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరిగిందని చెబుతున్నారు.

దీంతో అధికార పార్టీ నేతలు దర్పం చలాయిస్తున్నారా లేక ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలకు ఊడిగం చేస్తున్నారా అన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమంగా నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదులు అందినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకపోవడానికి ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సాకుగా చూపుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ ఆరోపిస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ముందు భాగంలో ఉన్న సర్వేనెంబర్ 367లో మొత్తం 1.20గుంటల భూమి ఉన్నట్లు రెవిన్యూ రికార్డులు చెబుతున్నాయి. 20 గుంటల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, 6 గుంటలు ఆర్ అండ్ బి ఆఫీస్, మరో రెండు గుంటలు టీఎన్జీవో భవన్ తో పాటు 3గుంటలు నిషేధిత ప్రభుత్వ భూమిగా ( ఓపెన్ ప్లేస్) ఉన్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. ప్రస్తుత ఆ జాగాలోనే చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపడుతూ ఉండేవి.

కాగా అదే స్థలంలో ఆ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తుండగా బహుజన్ సమాజ్ పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలంలో అధికార పార్టీ భవనం నిర్మించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారికి ఆనుకొని వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులను ట్రాఫిక్ అంతరాయం పేరుతో బలవంతంగా ఖాళీ చేయించిన మున్సిపల్ అధికారులు అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

బస్టాండ్ ప్రాంగణం ఆనుకొని జీవనం సాగిస్తున్న సంచారా జాతులను కూడా తాజాగా బలవంతంగా కాళీ చేయించారని మరి ఇట్టి ప్రభుత్వ భూమిలో కార్యాలయాన్ని నిర్మించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మౌనరాగం వహించడం వెనక ఆంతర్యమేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదే సర్వే నెంబర్ లోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భారీ అంతస్థు కూడా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు అప్పట్లో స్థానికుల నుండి ఫిర్యాదులందాయి. కానీ సదరు వ్యక్తులు అప్పటి అధికార పార్టీ బిఆర్‌ఎస్ లోకి మారడంతోనే అక్రమం సక్రమంగా మారినట్లు ప్రచారం. ఈ నేపథ్యంలోనే టిఆర్‌ఎస్ పార్టీ కూడా ఈ వ్యవహారంలో మౌనం వహిస్తుందా అన్న అనుమానాలున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం ఈ విషయంలో ముఖం చాటేస్తున్న పరిస్థితి ఏర్పడింది. 

ఒక్కోరికి ఒక్కో న్యాయమా...?

పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఉందంటూ అమాయక వీధి వ్యాపారుల దుకాణాలు, బస్టాండ్ ప్రాంతంలోని సంచార జాతుల షెడ్డులను బలవంతంగా తొలగించినప్పుడు విలువైన ప్రభుత్వ జాగాలో అధికార పార్టీ కార్యాలయం నిర్మాణం చేపడుతుంటే ఎందుకు పట్టించుకోరు. అఖిలపక్షాన్ని కూడగట్టి ఇట్టి ప్రభుత్వ భూమిని కాపాడుతాం. 

- పృధ్విరాజ్, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వ భూమి కానే కాదు... కొనుగోలు చేసిన జాగా..!

2004 ప్రాంతంలో ఒక వ్యక్తి స్వచ్ఛందంగా పార్టీకి దానంగా ఆ జాగానందించారు. అయినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి సదరు వ్యక్తికి పరిహారం కూడా అందించారు. అనంతరం ఆ జాగలోనే జండా కార్యక్రమం, పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం.   

- డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే