17 July, 2026 | 12:42 AM

పాలమూరు ముఖచిత్రాన్ని మార్చిందే కేసీఆర్

17-07-2026 12:42 AM
  1. రేవంత్ ఇచ్చిన బహుమతి మళ్లీ వలసలే
  2. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి) : పాలమూరు ముఖ చిత్రాన్ని మార్చిందే కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి మళ్లీ పాలమూరుకు వలసలే బహుమతిగా ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణ తడిలేని పొడి మనిషి రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సమైక్యవాది అని, ఉద్యమ సమయంలోనే ఇది స్పష్టమైందన్నారు.

గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్లలో పాలమూరు ప్రాజెక్టులలో రేవంత్ ప్రభుత్వం తట్టెడు మట్టి ఎత్తింది లేదని, ఏ పనీ చేయకుండానే తాము చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. రెండున్నరేళ్లు పాలమూరు వైపు కన్నెత్తి చూడడానికి రేవంత్ రెడ్డికి సమయం చిక్కలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే డిండికి 40 టీఎంసీలకు అనుమతులు తీసుకురావాలని సవాల్ చేశారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం కాంగ్రెస్ కనీసం 5 లేదా రూ.600 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేదన్నారు. పాలమూరు బిడ్డను అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఎందుకు పడావు పెట్టారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు.

కేసీఆర్ పాలనలో జరిగిన ప్రగతిని కొనసాగించకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. అనవసర భేషజాలకు పో యి మొండి పట్టుదలతో పనులను ప డావు పెట్టొద్దని, కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు.